సొంత అక్కనే కడతేర్చిన తమ్ముడు.. 2.5 ఎకరాల భూమి కోసం సూర్యాపేటలో దారుణ హత్య

ఆస్తి కోసం రక్త సంబంధాలనే మరిచిపోయే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భూమి వివాదం చివరకు సొంత అక్క ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. సొంత తమ్ముడే అక్కను హత్య చేయించాడన్న ఆరోపణలు సంచలనంగా మారాయి.

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం పెన్ పహాడ్ గ్రామానికి చెందిన సైదులు కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకుంది. సైదులకు అక్క అంజమ్మ, చెల్లెలు లింగమ్మ, ఉపేంద్ర ఉన్నారు. ముగ్గురు వివాహం చేసుకోగా, అంజమ్మ భర్త చిన్నతనంలోనే మృతి చెందడంతో ఆమె ఇంటి దగ్గరే ఉంటూ జీవనం సాగిస్తోంది.

2007లో ఉపేంద్ర వివాహ సమయంలో గ్రామంలోని సర్వే నెంబర్ 119లో ఉన్న 2.5 ఎకరాల భూమిని పసుపు, కుంకుమల కింద ఆమెకు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇదే భూమి విషయంలో గత కొంతకాలంగా అన్న సైదులు, చెల్లెలు ఉపేంద్ర మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి.

ఈ భూ వివాదం జిల్లా కలెక్టర్, ఆర్డీవో, పోలీసుల సమక్షంలో పంచాయితీ దాకా వెళ్లింది. ఈ సమయంలో అక్క అంజమ్మ.. ఉపేంద్రకు మద్దతుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో అంజమ్మపై సైదులు తీవ్ర ఆగ్రహం పెంచుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

పథకం ప్రకారం ఉదయం కూలీ పనికి వెళ్తున్న అంజమ్మపై సైదులు తన బావమరుదులతో కలిసి దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్లు గీసే కత్తితో ఆమెపై దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

సైదులు కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి రక్షణ లభించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న ఆత్మకూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. ప్రాథమికంగా భూ వివాదమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ ఘటనలో పాల్గొన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button