Heat Wave Effect.. మెదడు, కళ్ల ఆరో్యంపై తీవ్ర ప్రభావం చూపొచ్చని వైద్యుల హెచ్చరిక

దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్‌వేవ్ ప్రభావంపై వైద్యులు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు కేవలం శారీరక అలసటకే కాకుండా మెదడు, కళ్ల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
వైద్యుల ప్రకారం, ఎండల్లో ఎక్కువసేపు ఉండటం, డీహైడ్రేషన్, వేడి గాలులకు గురికావడం వల్ల శరీరంలోని అంతర్గత సమతుల్యత దెబ్బతింటుంది. దీని కారణంగా తలనొప్పి, మైగ్రేన్, తల తిరగడం, అలసట, వాంతులు, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని ఆసుపత్రుల్లో హీట్‌వేవ్‌కు సంబంధించిన కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ముఖ్యంగా తీవ్రమైన తలనొప్పి, డీహైడ్రేషన్, కళ్లలో మంట, మైగ్రేన్ తీవ్రత పెరగడం వంటి సమస్యలతో రోగులు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు.

ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రికి చెందిన న్యూరాలజీ నిపుణుడు డాక్టర్ వినీత్ సూరి మాట్లాడుతూ, గత కొన్ని రోజుల్లో న్యూరాలజీ ఓపీ కేసులు సుమారు 20 శాతం పెరిగాయని చెప్పారు. అధిక వేడి, డీహైడ్రేషన్ కారణంగా మెదడుకు రక్తప్రసరణ ప్రభావితమవుతుందని, ఇది నాడీ వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుందని వివరించారు.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, తీవ్ర గందరగోళం, మాట తడబడటం, అసాధారణ నిద్రమత్తు, ఫిట్స్, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసహాయం తీసుకోవాలి. ఇవి తీవ్రమైన న్యూరాలజికల్ ఎమర్జెన్సీకి సంకేతాలు కావచ్చని హెచ్చరిస్తున్నారు.
ఇక కళ్ల ఆరోగ్యంపై కూడా వేసవి ప్రభావం ఎక్కువగా ఉంటోందని నేత్ర వైద్యులు చెబుతున్నారు. అధిక ఎండ, వేడి గాలులు, దుమ్ము, డీహైడ్రేషన్ కారణంగా కళ్లలో మంట, ఎర్రబడటం, నీరు కారడం, డ్రై ఐ సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
వియాన్ ఐ అండ్ రెటినా సెంటర్‌కు చెందిన డాక్టర్ నీరజ్ సందూజా మాట్లాడుతూ, పిల్లలు మరియు ఎక్కువసేపు బయట తిరిగేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలెర్జీలు, డ్రై ఐ సిండ్రోమ్, కంటి ఇన్‌ఫెక్షన్లు కూడా పెరుగుతున్నాయని చెప్పారు.

వైద్యులు సూచించిన జాగ్రత్తలు:
- మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండాలి
- తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే గొడుగు, సన్‌గ్లాసెస్ ఉపయోగించాలి
- ఎక్కువగా నీరు, కొబ్బరినీరు, మజ్జిగ, పండ్లరసాలు తీసుకోవాలి
- కళ్లను చేతులతో రుద్దకూడదు
- ఎయిర్ కండిషనర్ గదుల్లో ఎక్కువసేపు ఉండేవారు కంటి సంరక్షణపై శ్రద్ధ పెట్టాలి
- మొబైల్, ల్యాప్‌టాప్ వినియోగాన్ని తగ్గించాలి
దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.





