11 ఏళ్ల బాలుడిపై దారుణం.. ఆటో డ్రైవర్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

హైదరాబాద్‌లోని రామ్‌గోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సంచలన పోక్సో కేసులో నిందితుడికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్ అబ్దుల్ రెహ్మాన్‌కు హైదరాబాద్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది.
పిల్లల భద్రత విషయంలో పోలీసులు, న్యాయవ్యవస్థ కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నాయని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని పోక్సో చట్టానికి సంబంధించిన ప్రత్యేక సెషన్స్ కోర్టు మే 19న ఈ కీలక తీర్పును వెలువరించింది.
ఈ కేసు 2019 అక్టోబర్ 29న జరిగింది. 11 ఏళ్ల బాలుడు జలవిహార్ ప్రాంతం వద్ద నుంచి రాణిగంజ్ వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. అయితే ఆటో డ్రైవర్ అబ్దుల్ రెహ్మాన్ బాలుడిని నిర్ణీత మార్గంలో తీసుకెళ్లకుండా మార్గం మళ్లించాడు.
అనంతరం బతుకమ్మకుంట సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన ఉన్న పొదల్లోకి బాలుడిని బలవంతంగా తీసుకెళ్లి అతనిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు ప్రతిఘటించడంతో నిందితుడు అతని తలను గోడకు బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని బాలుడిని రక్షించారు. నిందితుడిని అక్కడికక్కడే పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు రామ్‌గోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు దర్యాప్తు చేపట్టి బలమైన ఆధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
నిందితుడు అబ్దుల్ రెహ్మాన్ బేగంపేట్‌లోని పాటిగడ్డ, ఎన్బీటీ నగర్‌కు చెందినవాడిగా పోలీసులు తెలిపారు. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
కేసును విచారించిన ప్రత్యేక పోక్సో కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అదనంగా రూ.6 వేల జరిమానా కూడా విధించింది. అలాగే బాధిత బాలుడికి రూ.75 వేల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసును విజయవంతంగా ఛేదించిన దర్యాప్తు బృందాన్ని సికింద్రాబాద్ జోన్ డీసీపీ శ్రీమతి రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్ అభినందించారు. కేసు విచారణలో పాల్గొన్న పోలీసు అధికారులు, న్యాయ బృందం కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు.





