టీ తాగుదామని కారులో తీసుకెళ్లి ఘాతుకం.. హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థినిపై సహ విద్యార్థి అత్యాచారం

హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సహాధ్యాయి అని నమ్మి కారులో వెళ్లిన ఓ బీటెక్ విద్యార్థినిపై సహ విద్యార్థి అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపుతోంది. యువతిని నమ్మించి బయటకు తీసుకెళ్లిన నిందితుడు, బలవంతంగా మద్యం తాగించి అనంతరం అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బాధిత యువతి, ఉడతల ఉదయ్ అనే యువకుడు కలిసి బీటెక్ చదువుతున్నారు. ఇద్దరూ ఒకే క్లాస్‌లో చదువుతుండటంతో కొంతకాలంగా పరిచయం ఏర్పడింది.

మే 14 రాత్రి సమయంలో నిందితుడు ఉదయ్ “టీ తాగి వద్దాం” అంటూ యువతిని నమ్మించి ఆమె ఉంటున్న గది వద్ద నుంచి కారులో తీసుకెళ్లాడు. అనంతరం దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో కొంతసేపు కారులో తిప్పిన తర్వాత తిరిగి ఇబ్రహీంపట్నం వైపు బయలుదేరాడు.

మార్గమధ్యంలో మద్యం కొనుగోలు చేసిన నిందితుడు, ఇబ్రహీంపట్నంలోని బీడీఎల్ రోడ్ వైపు కారును తీసుకెళ్లి బాధితురాలికి బలవంతంగా మద్యం తాగించినట్లు విచారణలో వెల్లడైంది. తాను కూడా మద్యం సేవించిన అనంతరం మత్తులో ఉన్న యువతిని ఓ గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటన తర్వాత బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి మే 15న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.

సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి కేసును వేగంగా ఛేదించాయి. ఘటన జరిగిన మూడు రోజుల్లోనే నిందితుడు ఉడతల ఉదయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటన హైదరాబాద్‌లో మరోసారి మహిళల భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తోంది. యువతులు అపరిచిత పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button