తిరుపతిలో ఎన్సీసీ విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం.. పోక్సో చట్టం, సైబర్ నేరాలపై కీలక సూచనలు

తిరుపతిలో ఎన్సీసీ విద్యార్థినులకు మహిళల భద్రత, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీమతి శ్రీలత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ క్యాంపస్లో నిర్వహిస్తున్న 5 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఎన్సీసీ శిబిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీ తమిమ్ అహ్మద్, IV అదనపు ఏజేసీజే కోర్టు ఏపీపీ శ్రీమతి సుజాత, శక్తి టీమ్ సభ్యులు పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పోక్సో చట్టం, మహిళల హక్కులు, లీగల్ లిటరసీ, బాలికల భద్రతపై సమగ్రంగా వివరించారు. ముఖ్యంగా మహిళలపై పెరుగుతున్న నేరాలు, చైల్డ్ పోర్నోగ్రఫీ, బాల్య వివాహాలు, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, మెసేజ్లు, ఫేక్ అకౌంట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఏవైనా వేధింపులు లేదా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
అదేవిధంగా విద్యార్థినులు స్పష్టమైన లక్ష్యంతో చదువులు కొనసాగించాలని అధికారులు ప్రోత్సహించారు. ప్రభుత్వ ఉద్యోగాల ప్రాధాన్యత, భవిష్యత్తులో ఉన్న ఉపాధి అవకాశాలపై కూడా వివరించారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, చట్టాలపై అవగాహన ప్రతి మహిళకు రక్షణ కవచంలా పనిచేస్తాయని పేర్కొన్నారు.
మహిళల భద్రతపై ఇలాంటి అవగాహన కార్యక్రమాలు యువతలో చైతన్యం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు.





