కడప బాలిక హత్యపై సీఎం చంద్రబాబు ఆగ్రహం.. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశం

కడప జిల్లాలో బాలిక హత్య ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత దారుణమైందని, బాధాకరమని పేర్కొంటూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కాజీపేట ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలిక హత్య విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష తప్పదని హామీ ఇచ్చారు.
బాధిత బాలిక తల్లిదండ్రులు నిందితుడిపై ఎన్కౌంటర్ చేయాలని సీఎంను కోరినట్లు సమాచారం. దీనిపై స్పందించిన చంద్రబాబు చట్టపరమైన విధానంలోనే న్యాయం జరుగుతుందని తెలిపారు.
ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
ఘటన తర్వాత ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడిని ప్రజలకు అప్పగించాలని స్థానికులు డిమాండ్ చేసినప్పటికీ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీపడదని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.





