బస్సు ఎక్కుతున్న మహిళకు షాక్.. 35 తులాల బంగారం కాజేసిన మహిళా దొంగలు

విశాఖపట్నంలోని ప్రధాన ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సంచలన చోరీ జరిగింది. ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకున్న ఇద్దరు మహిళా దొంగలు ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగ్‌లోని 35 తులాల బంగారు ఆభరణాలను అత్యంత చాకచక్యంగా కాజేశారు. ఈ ఘటనతో ఆర్టీసీ కాంప్లెక్స్‌లో భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ వెళ్లేందుకు ఓ మహిళా ప్రయాణికురాలు బస్సు ఎక్కుతున్న సమయంలో ఈ చోరీ జరిగింది. బాధితురాలు తన బ్యాగ్‌లో సుమారు 35 తులాల బంగారు ఆభరణాలను తీసుకెళ్తుండగా, ఇద్దరు మహిళలు కూడా ప్రయాణికుల్లా నటిస్తూ ఆమె వెనుక వెళ్లారు.
బస్సు ఎక్కే సమయంలో రద్దీని ఉపయోగించుకుని నెట్టుకుంటూ వెళ్లినట్లు నటించిన నిందితులు, అత్యంత చాకచక్యంగా బాధితురాలి బ్యాగ్ జిప్ తెరిచి అందులో ఉన్న బంగారు నగలను అపహరించారు. అనంతరం అక్కడి నుంచి ఎవరికి అనుమానం రాకుండా పరారయ్యారు.
కొంతసేపటి తర్వాత బ్యాగ్‌ను పరిశీలించిన బాధితురాలు నగలు కనిపించకపోవడంతో షాక్‌కు గురైంది. వెంటనే ఆర్టీసీ కాంప్లెక్స్ అధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో ఇద్దరు మహిళలు దొంగతనానికి పాల్పడిన దృశ్యాలు నమోదైనట్లు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మహిళా దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికులు రద్దీ ప్రాంతాల్లో తమ విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.





