తిరుమలలో భక్తుల భారీ రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటలకు పైగా నిరీక్షణ

వేసవి సెలవులు, వారాంతపు రద్దీ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయాయి. సర్వదర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
టీటీడీ వర్గాల సమాచారం ప్రకారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్లు నారాయణగిరి ప్రాంతం వరకు విస్తరించాయి. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు 18 నుండి 20 గంటల వరకు సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.
వేసవి సెలవులతో పాటు వీకెండ్ కావడంతో కుటుంబ సమేతంగా భక్తులు తిరుమలకు భారీగా చేరుకుంటున్నారు. శ్రీవారి దర్శనం కోసం రోజుకు వేల సంఖ్యలో భక్తులు వస్తుండటంతో టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సదుపాయాలను క్యూ లైన్ల వద్దే అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.
భారీ రద్దీని నియంత్రించేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక వ్యవస్థలను వినియోగిస్తోంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తిరుమలలోని క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, రహదారులు, పార్కింగ్ ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వందలాది సీసీటీవీ కెమెరాల సహాయంతో భక్తుల రద్దీని విశ్లేషిస్తూ అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమిస్తున్నారు.
టీటీడీ గణాంకాల ప్రకారం వీకెండ్ రోజుల్లో 85 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇటీవల ఒక్కరోజే 91 వేల మందికి పైగా భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
భక్తుల రద్దీ మరికొన్ని రోజులు కొనసాగనున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు ముందస్తు ప్రణాళికతో రావాలని టీటీడీ సూచించింది.





