తిరుమల శ్రీవారికి సమర్పించిన వస్త్రాల ఈ-వేలం.. భక్తులకు అరుదైన అవకాశం

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో అరుదైన అవకాశం కల్పిస్తోంది. తిరుమల శ్రీవారికి, టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు సమర్పించిన వస్త్రాలను ఈ-వేలం ద్వారా విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది
మే 21 నుంచి జూన్ 2 వరకు ఈ-వేలం నిర్వహించనున్నారు. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్నవి కలిపి మొత్తం 505 లాట్లను వేలంలో ఉంచుతున్నారు.
ఈ వేలంలో పాలిస్టర్, నైలాన్, కాటన్ చీరలు, క్లాత్ బిట్స్, బ్లౌజ్ పీస్‌లు, ఉత్తరీయాలు, టర్కీ టవళ్లు, లుంగీలు, శాలువాలు, బెడ్‌షీట్లు, దిండుకవర్లు, పంజాబీ డ్రెస్ మెటీరియల్స్, కార్పెట్లు, దుప్పట్లు, కర్టెన్లు, పరదాలు, శిరోవస్త్రాలు, గొడుగులు, హుండీ గల్లేబులు, ఈర్వాడాలు తదితర వస్త్ర సామగ్రి అందుబాటులో ఉండనున్నాయి.
శ్రీవారికి సమర్పించిన వస్తువులను సొంతం చేసుకోవాలనుకునే భక్తులు ఈ ఈ-వేలంలో పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది. ఆసక్తి ఉన్నవారు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.
అలాగే టీటీడీ అధికారిక వెబ్‌సైట్లు www.konugolu.ap.gov.in మరియు www.tirumala.org ద్వారా కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఇదే సమయంలో తిరుమల శ్రీవారి ఆలయం, టీటీడీ అనుబంధ ఆలయాల్లో వినియోగించిన ఖాళీ గోనె సంచులను కూడా 2026-27 సంవత్సరానికి మే 26న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు.
ఈ వేలంలో పాల్గొనదలచిన వారు మే 25 మధ్యాహ్నంలోపు ఆన్‌లైన్‌లో రూ.75 వేల ఈఎండీ చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
ఇక నాగలాపురంలోని శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయంలో మే 30న కంచి గరుడసేవను వైభవంగా నిర్వహించనున్నారు. కంచిలోని శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో జరిగే మహా గరుడసేవ సందర్భంగా నాగలాపురంలో కూడా ఈ ప్రత్యేక సేవ నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఉదయం 6:30 నుంచి 8:30 గంటల వరకు శ్రీ వేద నారాయణ స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరారు.
ఇదిలా ఉండగా తిరుమల శ్రీవారి వేద పరిరక్షణ ట్రస్టుకు మరో భారీ విరాళం అందింది. బెంగుళూరుకు చెందిన స్వాతి ఎస్వీ, సీఏ శ్రీనివాస శాస్త్రి కలిసి రూ.50,00,101 విరాళంగా అందజేశారు. తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరికి చెక్కును అందించారు.





