రేణిగుంటలో ‘డ్రగ్స్ పై దండయాత్ర 2.0’.. గంజాయి వినియోగదారులకు ప్రత్యేక డ్రగ్ టెస్టులు

తిరుపతి జిల్లా పోలీసులు గంజాయి నిర్మూలనపై మరింత దృష్టి సారిస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు రేణిగుంట పోలీసులు “డ్రగ్స్ పై దండయాత్ర 2.0” కార్యక్రమాన్ని నిర్వహించి గంజాయి విక్రేతలు, వినియోగదారులపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.
మంగళవారం రేణిగుంటలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో గంజాయి అలవాటు ఉన్న అనుమానితులకు ‘బయో-చెక్’ కిట్ల ద్వారా డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో గంజాయి విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డీఎస్పీ మాట్లాడుతూ గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నవారు, గంజాయి విక్రయించే పెడ్లర్లు, వినియోగదారుల వివరాలను సేకరించి వారిని ఎన్టీఆర్ కూడలి వద్దకు పిలిపించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను ‘బయో-చెక్’ కిట్ల ద్వారా పరీక్షించి గంజాయి వినియోగిస్తున్నారా లేదా అనేది నిర్ధారిస్తున్నామని తెలిపారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారి ద్వారా గంజాయి సరఫరా నెట్‌వర్క్‌కు సంబంధించిన ఫార్వర్డ్, బ్యాక్‌వర్డ్ లింకులను గుర్తించి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.
గంజాయికి బానిసైన వారిని పూర్తిగా ఆ అలవాటు నుంచి బయటపడేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వారి తల్లిదండ్రుల సమ్మతితో కౌన్సిలింగ్ నిర్వహించి పునరావాస కేంద్రాలకు పంపిస్తున్నామని వెల్లడించారు.
పాపానాయుడుపేటలోని ‘రాస్’ పునరావాస కేంద్రంతో పాటు స్విమ్స్, రుయా ఆసుపత్రుల్లోని డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా బాధితులకు చికిత్స, పునరావాస సేవలు అందిస్తున్నట్లు వివరించారు.
సమాజంలో గంజాయి మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని డీఎస్పీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు, డ్రగ్ పరీక్షలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రేణిగుంట సీఐ జయచంద్రతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





