నిరుద్యోగుల కోసం ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. 48 గంటల్లో 40 వేల సభ్యులు!

దేశంలో నిరుద్యోగ సమస్య, యువత ఆవేదనల మధ్య ఓ వినూత్న రాజకీయ పార్టీ వెలుగులోకి వచ్చింది. “కాక్రోచ్ జనతా పార్టీ” (సీజేపీ) పేరుతో ప్రారంభమైన ఈ కొత్త రాజకీయ వేదిక ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కేవలం 48 గంటల్లోనే 40 వేల మందికి పైగా యువత ఈ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఢిల్లీకి చెందిన 30 ఏళ్ల అభిజీత్ దీప్కే ఈ పార్టీని ప్రారంభించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పార్టీ ఆవిర్భవించింది.
ఇటీవల నిరుద్యోగ యువతపై సీజేఐ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. నిరుద్యోగులను “సోమరిపోతులు”, “బొద్దింకలు” అంటూ వ్యాఖ్యానించారనే ఆరోపణలతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం తన వ్యాఖ్యలను వక్రీకరించారని సీజేఐ వివరణ ఇచ్చినా అప్పటికే వివాదం చెలరేగిపోయింది.

ఈ వ్యాఖ్యలకు నిరసనగా డిజిటల్ ఉద్యమంలా “కాక్రోచ్ జనతా పార్టీ”ని ప్రారంభించినట్లు అభిజీత్ దీప్కే వెల్లడించారు. మే 16న సోషల్ మీడియా ద్వారా పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించగా ఊహించని స్థాయిలో యువత నుంచి స్పందన వచ్చింది.
ఈ పార్టీ ప్రధాన లక్ష్యం యువత సమస్యలను రాజకీయ అజెండాగా మార్చడం అని వ్యవస్థాపకుడు తెలిపారు. ప్రజాధనం ఎలా ఖర్చవుతోంది? పాలకులు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేస్తున్నారు? వంటి అంశాలపై ప్రభుత్వాలను ప్రశ్నించడమే తమ లక్ష్యమన్నారు.
ఈ పార్టీ నినాదాలు కూడా వినూత్నంగా ఉండటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్” సిద్ధాంతాలతో పాటు “లేజీ” కూడా తమ ప్రధాన నినాదమని పార్టీ ప్రకటించడం చర్చకు దారితీసింది.

అలాగే సభ్యత్వానికి పెట్టిన అర్హతలు మరింత ఆసక్తికరంగా మారాయి. సభ్యుడు తప్పనిసరిగా నిరుద్యోగి అయి ఉండాలని, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని, వ్యవస్థపై ఉన్న అసంతృప్తిని డిజిటల్ వేదికల్లో వ్యక్తపరచగలగాలని పార్టీ పేర్కొంది.
ఈ పార్టీపై పలువురు రాజకీయ ప్రముఖులు కూడా స్పందించడం విశేషం. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సరదాగా “నేను ఇప్పటికే యాంటీ నేషనల్ పార్టీ సభ్యురాలిని.. మీతో పని చేయొచ్చా?” అంటూ ట్వీట్ చేయగా, పార్టీ నుంచి కూడా అదే స్థాయిలో క్రేజీ రిప్లై వచ్చింది.
మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ సభ్యత్వ అర్హతల గురించి ప్రశ్నించగా “1983 వరల్డ్ కప్ గెలవడానికంటే పెద్ద అర్హత ఏం ఉంటుంది సర్” అంటూ పార్టీ స్పందించింది.
సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ పార్టీకి పారదర్శకతపై పలు సూచనలు చేశారు. ఎలక్టోరల్ బాండ్లు లేదా రహస్య విరాళాలు స్వీకరించకూడదని, సమాచార హక్కు చట్టం పరిధిలో జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు. ఈ సూచనలను కూడా పార్టీ స్వాగతించింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ “కాక్రోచ్ జనతా పార్టీ” భవిష్యత్తులో నిజమైన రాజకీయ శక్తిగా మారుతుందా లేదా అనేది పక్కన పెడితే, యువత అసంతృప్తిని వ్యక్తపరచడానికి ఇది ఒక కొత్త డిజిటల్ ఉద్యమంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
త్వరలో పార్టీ కార్యాచరణ, భవిష్యత్తు ప్రణాళికలపై ప్రత్యేక ఆన్‌లైన్ సమావేశం నిర్వహించనున్నట్లు అభిజీత్ దీప్కే ప్రకటించారు.





