రేణిగుంట పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ.. పెండింగ్ కేసులపై ఆరా

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ గారు రేణిగుంట పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలను సమగ్రంగా పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
మొదటగా స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ, పరిశుభ్రత మరియు నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు సానుకూల వాతావరణం కనిపించేలా స్టేషన్ను నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేసి, పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిపై ఆరా తీశారు. విచారణలో ఆలస్యం లేకుండా ప్రతి కేసును వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు, నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. గంజా, మత్తు పదార్థాలు, దొంగతనాలు మరియు ఇతర నేరాల నియంత్రణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రజల్లో భద్రతాభావం పెంచేందుకు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, ముఖ్య ప్రాంతాల్లో గస్తీ మరింత పెంచాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
మహిళలకు సంబంధించిన కేసులు, ఫిర్యాదుల విషయంలో తక్షణ స్పందన అవసరమని ఎస్పీ స్పష్టం చేశారు. బాధిత మహిళలకు వెంటనే సహాయం అందించి చట్టపరమైన చర్యలు వేగంగా చేపట్టాలని సూచించారు.
ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా స్వీకరించి బాధితులకు న్యాయం జరిగేలా పని చేయాలని పోలీస్ సిబ్బందికి ఎస్పీ దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





