ఉన్నత చదువులు చదివి చైన్ స్నాచర్లుగా మారిన ముగ్గురు యువకుల అరెస్ట్.. రూ.25 లక్షల బంగారం స్వాధీనం

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్జిల్లా నిందితులను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగాలు చేసిన ఈ యువకులు దురలవాట్లు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి చివరకు చైన్ స్నాచర్లుగా మారినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ (క్రైమ్స్) శ్రీ ఆర్ల శ్రీనివాసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తిరుపతి సీసీఎస్, వెస్ట్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఈ ముఠాను పట్టుకున్నారు. తిరుపతిలో ఇటీవల పెరిగిన చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

మే 25న అలిపిరి-చెర్లోపల్లి రోడ్డులోని సైన్స్ సెంటర్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, పలు దొంగతనాల కేసులు వెలుగులోకి వచ్చాయి.

అరెస్టైన నిందితుల్లో శీలం నాగార్జున రెడ్డి (అగ్రికల్చర్ బీఎస్సీ), నల్లగొండ వెంకట మురళి (బీకాం కంప్యూటర్స్), లింగాలదిన్నే విష్ణువర్ధన్ రెడ్డి (బీఎస్సీ స్టాటిస్టిక్స్, మాజీ సిస్టమ్ ఇంజనీర్) ఉన్నారు. వీరు ఉన్నత విద్యావంతులే కావడం పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

పోలీసులు నిందితుల వద్ద నుంచి సుమారు రూ.25 లక్షల విలువైన 130 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లు, హెల్మెట్లు, మాస్కులు స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో నిందితులు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు బానిసలై భారీగా అప్పుల్లో కూరుకుపోయినట్లు అంగీకరించారు. సోషల్ మీడియాలో చైన్ స్నాచింగ్ పద్ధతులు, పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలో వీడియోలు చూసి నేరాలకు పాల్పడినట్లు వెల్లడించారు.

బైక్‌ల నెంబర్ ప్లేట్లు తొలగించి, హెల్మెట్లు, మాస్కులు ధరించి తెల్లవారుజామున ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసేవారని పోలీసులు తెలిపారు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 9 చైన్ స్నాచింగ్ కేసులకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారని చెప్పారు.

దొంగిలించిన బంగారాన్ని విక్రయించి మళ్లీ విలాసాల కోసం డబ్బు సమకూర్చుకునేందుకు తిరుపతిలో మరో చైన్ స్నాచింగ్‌కు ప్లాన్ చేస్తున్న సమయంలో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.

ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు అభినందించి రివార్డులు ప్రకటించారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button