కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలు జూన్ 6 నుంచి ప్రారంభం.. 10న గరుడసేవ, 13న రథోత్సవం

కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6 నుండి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. జూన్ 5వ తేదీ సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాలకు ముందు జూన్ 2వ తేదీ ఉదయం 7:30 గంటల నుండి 11:30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రిని పవిత్ర జలాలతో శుద్ధి చేయనున్నారు.
నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేయనున్నారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 7:30 గంటల నుండి 9:30 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
జూన్ 6న ఉదయం 8:10 గంటల నుండి 8:45 గంటల వరకు కర్కాటక లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

వాహన సేవల వివరాలు ఇలా ఉన్నాయి:
- జూన్ 7 – ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం
- జూన్ 8 – ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం
- జూన్ 9 – ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి సర్వభూపాల వాహనం
- జూన్ 10 – ఉదయం మోహినీ అవతారం, రాత్రి మహాగరుడ వాహనం
- జూన్ 11 – ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం
- జూన్ 12 – ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం
- జూన్ 13 – ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం
- జూన్ 14 – ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ 9న స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. రూ.300 చెల్లించి ఇద్దరు గృహస్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. పాల్గొనే వారికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం ప్రసాదంగా అందజేయనున్నారు.
అలాగే జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల నుండి 4 గంటల వరకు పుష్పయాగాన్ని భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించనున్నారు.





