తిరుమల భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు.. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యం: అడిషనల్ ఈవో

తిరుమలకు వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శన అనుభవం కల్పించడంతో పాటు భక్తుల్లో విశ్వాసం పెంపొందేలా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తూ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా, తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న సమయ నిర్దేశిత సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లను ఆదివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ తనిఖీలలో టీటీడీ జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, అన్నప్రసాదం, తాగునీరు, భద్రత తదితర సేవలను సమర్థవంతంగా అందిస్తున్నామని తెలిపారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, విష్ణునివాసం కేంద్రాల ద్వారా సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని చెప్పారు.

భక్తుల కోసం ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, సమాచార ప్రసార వ్యవస్థ, వర్షాలకు తడవకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విజిలెన్స్‌, జిల్లా పోలీసులు, శ్రీవారి సేవకులు మరియు ఇతర విభాగాలు నిరంతరం సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

రోజుకు లక్ష మందికి పైగా భక్తులు తిరుమలకు వచ్చినప్పటికీ దర్శన సమయాలు, క్యూలైన్ల పరిస్థితులు, భక్తుల సంఖ్య వంటి అంశాలను నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రతి సీజన్‌లో భక్తుల రద్దీ భిన్నంగా ఉంటుందని, అందుకు అనుగుణంగా ప్రత్యేక నిర్వహణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

టీటీడీ అధికారిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని భక్తులు తిరుమలకు వస్తే అందరికీ సులభంగా శ్రీవారి దర్శనం కల్పించవచ్చని సూచించారు.

భక్తులను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు హెచ్చరించారు.

పోలీసు, ట్రాఫిక్‌, టీటీడీ విజిలెన్స్ విభాగాలు సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లో కొందరు ఆటో డ్రైవర్లపై ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటికే వారికి కౌన్సెలింగ్ ఇచ్చామని చెప్పారు. అవసరమైతే ఆటోలను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై హెచ్చరిక

టీటీడీ సీవీఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ మాట్లాడుతూ భక్తులను మోసం చేసే తప్పుడు సోషల్ మీడియా ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. టీటీడీ అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, మోసపూరిత చర్యలపై వెంటనే టీటీడీ విజిలెన్స్‌కు సమాచారం అందించాలని కోరారు.

భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన క్యూలైన్లు, భద్రతా చర్యలు అమలు చేస్తున్నామని తెలిపారు.

అనంతరం అధికారులు శ్రీనివాసం, విష్ణునివాసం వద్ద ఉన్న సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ శ్రీ టి.వి. సత్యనారాయణ, తిరుపతి పోలీసు అధికారులు మరియు టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button