తిరుమలలో భారీ భక్తుల రద్దీ.. వేసవి వేడిలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు, 5 రోజుల్లో 4.32 లక్షల దర్శనాలు

వేసవి సెలవులు, అధిక భక్తుల రాకతో తిరుమలలో శ్రీ‌వారి దర్శనానికి వచ్చే యాత్రికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం తిరుమలలో భారీ రద్దీ నెలకొనడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ విస్తృత స్థాయిలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.

ఎండ తీవ్రత నుంచి భక్తులకు ఉపశమనం కల్పించేందుకు బాట గంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు భారీ చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంతం, నారాయణగిరి ఉద్యానవనాల్లో అదనపు షెల్టర్లు ఏర్పాటు చేసి భక్తులకు నీడ కల్పిస్తున్నారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల కోసం తాత్కాలిక షెడ్లు, కూల్ పెయింటింగ్ పనులు కూడా నిర్వహించారు.

శ్రీవారి ఆలయం పరిసరాలు, లడ్డూ కౌంటర్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేకంగా చలువ పందిళ్లు నిర్మించారు. నాలుగు మాడ వీధుల్లో నేల వేడి తగ్గించేందుకు సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్ వేశారు. అదేవిధంగా క్యూలైన్ల వెంట తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.

టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులు భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, అల్పాహారం, భోజనం పంపిణీ చేస్తున్నారు. ఉదయం పాలు ఉప్మా, పొంగల్‌, మధ్యాహ్నం సాంబారన్నం, పులిహోర, టమోటా రైస్‌, రాత్రి సాంబారన్నం వంటి ఆహార పదార్థాలు అందిస్తున్నారు. ఆరోగ్య విభాగం తరఫున మొబైల్ వాటర్ డ్రమ్ముల ద్వారా రద్దీ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు తాగునీరు అందిస్తున్నారు.

రద్దీని దృష్టిలో పెట్టుకుని ఔటర్ రింగ్ రోడ్ క్యూలైన్ల వద్ద మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. తిరుమలలో పరిమిత సంఖ్యలో మాత్రమే వసతి గదులు అందుబాటులో ఉండటంతో ప్రస్తుతం సుమారు 7,500 గదులు, ఐదు యాత్రికుల వసతి సముదాయాలు పూర్తిగా నిండిపోయాయి. గదులు లభించని భక్తుల కోసం పీఏసీ-1 నుంచి పీఏసీ-5 వరకు దాదాపు 9 వేల లాకర్లు అందుబాటులో ఉంచారు.

తలనీలాల సమర్పణ కోసం ప్రధాన కళ్యాణకట్టతో పాటు 11 మినీ కళ్యాణకట్టలు భక్తులకు సేవలు అందిస్తున్నాయి. క్షురకులు నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్నారు.

గత ఐదు రోజుల్లోనే 4,32,213 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మే 16, 17 తేదీల్లో 90 వేలకుపైగా భక్తులు దర్శనం చేసుకోవడం విశేషం. ఇదే సమయంలో మే 18, 19, 20 తేదీల్లో 43 వేలకుపైగా భక్తులు తలనీలాలు సమర్పించారు.

అలాగే గత ఐదు రోజుల్లో దాదాపు 19 లక్షల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ పంపిణీ చేసినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు సేవలు అందిస్తున్నారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button