శెట్టిపల్లి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 2,048 మందికి ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ ప్రారంభం

తిరుపతి జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న శెట్టిపల్లి భూ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పరిష్కారం చూపింది. స్థానిక కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో 2,048 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ పాల్గొని లబ్ధిదారులకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సొంతింటి కల నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
దాదాపు 70 ఏళ్లుగా కొనసాగుతున్న శెట్టిపల్లి భూ సమస్యకు భూ సమీకరణ విధానంతో శాశ్వత పరిష్కారం తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ సంకల్పం, అధికారుల సమన్వయంతో ఈ ప్రాజెక్ట్‌ను మోడల్ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.
లబ్ధిదారులకు కేటాయిస్తున్న ప్లాట్ల వద్ద వాస్తు ప్రకారం ప్రణాళిక, విశాలమైన రహదారులు, పార్కులు, పాఠశాలలు, తాగునీటి సదుపాయం, డ్రైనేజీ వ్యవస్థ వంటి అన్ని మౌలిక వసతులతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.

2025లో ఈ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం లభించిందని, పేదలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం రూ.17.50 కోట్ల రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా మాఫీ చేసినట్లు చెప్పారు.
2026 జనవరిలో ఈ-డిప్ లాటరీ విధానం ద్వారా పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు చేపట్టినట్లు వెల్లడించారు. త్వరలోనే రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, తుడా చైర్మన్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





