సర్వభూపాల వాహనంపై దివ్యంగా వెలసిన శ్రీ గోవిందరాజస్వామి..

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి వైభవంతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామివారు సర్వభూపాల వాహనంపై విహరించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఈ వాహనసేవలో తిరుపతి మాడవీధులు గోవింద నామస్మరణలతో మారుమోగిపోయాయి.

వాహనసేవ సందర్భంగా భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పిస్తూ స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాలతో తిరుపతి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

సర్వభూపాల వాహనానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. “సర్వభూపాల” అంటే సమస్త రాజులు, దిక్పాలకులు అని అర్థం. సర్వలోకాల అధిపతిగా శ్రీహరి అందరి హృదయాల్లో కొలువై ఉంటాడనే భావాన్ని ఈ వాహనసేవ ప్రతిబింబిస్తుంది. దిక్పాలకులు స్వామివారిని తమ భుజస్కంధాలపై మోసుకుంటూ భగవత్సేవలో నిమగ్నమై ధర్మబద్ధంగా ప్రజలను పాలిస్తారనే ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ సేవ ద్వారా భక్తులకు తెలియజేస్తారు.

టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత, హరికథ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భజనలు, వేదఘోషలు, ఆధ్యాత్మిక సంగీతంతో బ్రహ్మోత్సవాలు మరింత వైభవంగా కొనసాగుతున్నాయి.

ఇక బుధవారం ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు మోహినీ అవతారోత్సవం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి అత్యంత వైభవంగా జరిగే గరుడసేవలో శ్రీ గోవిందరాజస్వామివారు గరుడవాహనంపై విహరించి భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు. ఈ గరుడసేవను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, ఇతర అధికారులు, శ్రీవారి సేవకులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.
Back to top button