నారాయణవనం బ్రహ్మోత్సవాలకు ఘన ఏర్పాట్లు.. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: టిటిడి జేఈవో వీరబ్రహ్మం

నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 28 నుంచి జూన్ 5 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సోమవారం సాయంత్రం ఆలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను జేఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మే 28న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. జూన్ 1న గరుడవాహన సేవ, జూన్ 4న రథోత్సవం మరియు కళ్యాణోత్సవం, జూన్ 5న చక్రస్నానం ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని ఆయన సూచించారు. ముఖ్యంగా గరుడసేవ, రథోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రత, ట్రాఫిక్, తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ వంటి అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ఆలయ రథం పరిస్థితిని పూర్తిగా పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించాలని, వాహన సేవలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని తెలిపారు. స్కౌట్స్, శ్రీవారి సేవకులను తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని చెప్పారు.
వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులకు చలువ పందిళ్లు, కూల్ పెయింటింగ్, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుధ్యం, డ్రైనేజీ పనులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఆలయ పరిసరాల్లో విద్యుత్ అలంకరణలు, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్, పెండింగ్ ఇంజినీరింగ్ పనులను మే 27 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ఎస్వీబీసీ ద్వారా శ్రీవారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించారు.

ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాలని జేఈవో పేర్కొన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ ఈవోలు, విజిలెన్స్ అధికారులు, ఇంజినీరింగ్, వైద్య, పారిశుధ్య విభాగాల అధికారులు పాల్గొన్నారు.





