తిరుపతిలో రోడ్డు భద్రతకు భారీ చర్యలు.. 10,000 గంజాయి టెస్టింగ్ కిట్లతో పోలీసుల ప్రత్యేక డ్రైవ్

తిరుపతి జిల్లాలో రోడ్డు భద్రత మరియు గంజాయి నిర్మూలన లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలను మరింత వేగవంతం చేసింది. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్., మరియు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., సంయుక్తంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆధునిక భద్రతా పరికరాలు, గంజాయి నిర్ధారణ కిట్లను ప్రారంభించారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు భాగంగా 11 మొబైల్ ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ వాహనాలకు సేఫ్టీ కోన్స్, రేడియం జాకెట్లు, ట్రాఫిక్ బాటన్ లైట్లు, రేడియం స్టిక్కర్లు వంటి ఆధునిక పరికరాలను అందజేశారు. అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి అధునాతన కూలింగ్ గ్లాసులు, వాటర్ బాటిళ్లు, రిఫ్లెక్టివ్ జాకెట్లు పంపిణీ చేశారు.

జాతీయ రహదారులపై గుర్తించిన 43 బ్లాక్ స్పాట్లలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. హైవే మొబైల్ వాహనాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుండగా, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, సీట్ బెల్ట్ ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇక గంజాయి నిర్మూలనలో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా తిరుపతి జిల్లాలో 10,000 రాపిడ్ గంజాయి టెస్టింగ్ కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. యూరిన్ శాంపిల్ ద్వారా కేవలం ఐదు నిమిషాల్లో ఫలితాలు తెలిపే ఈ కిట్లతో గంజాయి వినియోగదారులను గుర్తించనున్నారు. ఇప్పటికే 4,000 కిట్లను జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్లకు పంపిణీ చేసినట్లు ఎస్పీ తెలిపారు.

ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ప్రత్యేక మొబైల్ బస్సులను ఏర్పాటు చేసి గంజాయి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదటిసారి టెస్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయితే కౌన్సెలింగ్ అందిస్తుండగా, పదేపదే గంజాయి వినియోగం బయటపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
అంతేకాకుండా గంజాయి వినియోగదారుల ద్వారా సరఫరాదారులు, రవాణాదారుల వివరాలు సేకరించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గత నెలలోనే 4,500 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ మరియు రౌడీషీటర్లపై గత రెండేళ్లలో 37 పీడీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
ప్రజల సహకారంతో ప్రమాద రహిత, గంజాయి రహిత తిరుపతి నిర్మాణమే తమ లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.





