తిరుపతిలో వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి గరుడసేవ.. గోవింద నామస్మరణలతో మారుమోగిన మాడవీధులు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడవాహనసేవ బుధవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ఐదవ రోజు నిర్వహించిన ఈ మహోత్సవంలో శ్రీ గోవిందరాజస్వామివారు తనకు ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.

రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు సాగిన ఈ వాహనసేవలో తిరుపతి మాడవీధులు “గోవిందా… గోవిందా…” నామస్మరణలతో మారుమోగిపోయాయి. సర్వాభరణ భూషితుడై దివ్య కాంతులు వెదజల్లుతూ గరుత్మంతునిపై వెలసిన శ్రీ గోవిందరాజస్వామివారి మంగళ రూపం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.

బ్రహ్మోత్సవాల్లో గరుడసేవకు అత్యంత ప్రాధాన్యత ఉంది. గరుడవాహనంపై దర్శనమిచ్చే స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా అభివర్ణించారు. గరుత్మంతుని రెక్కలు వేదాల నిత్యత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని పండితులు పేర్కొంటున్నారు.

గరుడుని సేవాభావం, మాతృభక్తి, సత్యనిష్ఠ, ఉపకారగుణం సమాజానికి ఆదర్శప్రాయమని ఆధ్యాత్మిక వేత్తలు వివరిస్తున్నారు. జ్ఞానం, వైరాగ్యానికి ప్రతీకగా భావించే గరుడుడిని దర్శించుకోవడం ద్వారా భక్తులు తమ అభీష్టాలను సాధిస్తారనే విశ్వాసం ఉంది.

టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత, హరికథ, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాలతో తిరుపతి నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఈ సందర్భంగా తమిళనాడులోని తిరువండ్రవూరుకు చెందిన శ్రీ భాష్య కార్ల కైంకర్య ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ దినేష్ కుమార్ ఎనిమిది గొడుగులను టిటిడి ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరికి విరాళంగా అందించారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, విజివో శ్రీ గిరిధర్, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, ఇతర అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.
Back to top button