కుప్పం ప్రసన్న తిరుపతి గంగమ్మకు వైభవంగా శ్రీవారి సారె.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి టీటీడీ తరఫున శ్రీవారి సారెను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే ఈ జాతరలో 2014 సంవత్సరం నుండి టీటీడీ తరఫున శ్రీవారి సారె సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సుభిక్షంగా వర్ధిల్లాలని ముఖ్యమంత్రి అమ్మవారిని ప్రార్థించారు.

అంతకుముందు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ తరఫున సిద్ధం చేసిన శ్రీవారి సారెను ముఖ్యమంత్రి దంపతులకు అందజేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా ఆలయానికి తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు.

ఏడాదిలో ఒక్కసారే కల్పించే అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తజన సందోహంతో కళకళలాడింది. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తి పరవశంలో మునిగిపోయారు.

జాతర సందర్భంగా ఆలయ పరిసరాలను విద్యుద్దీపాలు, పుష్పాలంకరణలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతారామ్, టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button