టీటీడీలో రికార్డు స్థాయికి చేరిన తలనీలాల సమర్పణ.. మే నెలలో 12 లక్షల మందికి పైగా భక్తుల మొక్కు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి భక్తులు సమర్పించే తలనీలాలు మరోసారి రికార్డులు సృష్టిస్తున్నాయి. “నల్ల బంగారం”గా పిలిచే ఈ తలనీలాల సమర్పణలో 2026 మే నెల కొత్త చరిత్రను నమోదు చేసింది. మే 27వ తేదీ వరకు ఏకంగా 12.43 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం విశేషంగా మారింది.

టీటీడీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2026 మే 27 వరకు మొత్తం 12,43,063 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. 2024 మే నెలలో 10,65,729 మంది, 2025 మే నెలలో 10,18,370 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, ఈసారి ఆ సంఖ్య 12 లక్షలు దాటడం విశేషంగా నిలిచింది.

వేసవి సెలవులు, వారాంతపు రద్దీ కారణంగా తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా మే 18 నుంచి 23 వరకు వరుసగా ఆరు రోజుల పాటు ప్రతిరోజూ 50 వేల మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. అందులో మే 23న ఒక్కరోజే 57,580 మంది భక్తులు కేశఖండన చేయించుకోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ప్రధాన కళ్యాణకట్టతో పాటు పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ-5, జీఎన్‌సీ, హెచ్‌వీసీ, సప్తగిరి, నందకం, కౌస్తుభం, శ్రీ వేంకటేశ్వర, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహాల్లో మొత్తం 11 మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది.

ప్రస్తుతం టీటీడీలో 1,152 మంది క్షురకులు సేవలందిస్తున్నారు. వీరిలో 269 మంది మహిళా క్షురకులు కూడా ఉన్నారు. సాధారణంగా ఒక్కో క్షురకుడు ఆరు గంటల షిఫ్ట్‌లో 40 మంది భక్తులకు సేవలందిస్తారు. అయితే పెరిగిన రద్దీ నేపథ్యంలో అదనపు సిబ్బందిని నియమించి, ఒక్కో క్షురకుడు సుమారు 50 మంది అదనపు భక్తులకు కూడా సేవలందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పరిశుభ్రత విషయంలో టీటీడీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. భక్తులకు ఉపయోగించే బ్లేడ్లను ముందుగా సోడియం ద్రావణంలో శుభ్రపరిచి, అనంతరం డెటాల్‌తో శానిటైజ్ చేస్తున్నారు. తలనీలాలను ప్రత్యేకంగా సేకరించి భద్రపరుస్తున్నారు. అలాగే ప్రతి కళ్యాణకట్టలో స్నానగదులు, వేడి నీటి సదుపాయం, తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు కల్పించారు.

తలనీలాల సమర్పణ అనంతరం భక్తులకు చందన బిళ్లలను అందజేస్తూ, వారి మొక్కులు సాఫీగా నెరవేరేలా టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోంది. భక్తుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సేవల నాణ్యత తగ్గకుండా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.
Back to top button