దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. భయాలు అవసరం లేదు: నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

దేశ ఆర్థిక భద్రత కోసం పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బలంగా సమర్థించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మూడు కీలక అంశాలైన ఇంధనం (Fuel), ఎరువులు (Fertilizer), విదేశీ మారక నిల్వలు (Forex)పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ముంబయిలో జరిగిన సిడ్బి (SIDBI) 37వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలంగా ఉందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తాత్కాలిక అనిశ్చితులు ఏర్పడుతున్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకు సాగుతోందన్నారు.
ప్రధాని మోదీ పొదుపు గురించి చేసిన పిలుపు తర్వాత కొంతమంది కావాలనే నిరాశావాద ప్రచారం చేస్తున్నారని నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. “ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా తప్పుడు ప్రచారం చేయకూడదు. మన మాటలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలి” అని ఆమె వ్యాఖ్యానించారు.
ముడి చమురు ధరలు, బంగారం ధరలు పెరగడం కొంత ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె అంగీకరించారు. అలాగే ఎరువుల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో దేశీయ వృద్ధిని కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పలు విధానపరమైన చర్యలు తీసుకుంటోందన్నారు.
డీజిల్, పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించడం వల్ల ఖజానాపై సుమారు రూ.లక్ష కోట్ల వరకు భారం పడే అవకాశం ఉందని వెల్లడించారు. అయినప్పటికీ ప్రజలపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఈ సందర్భంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (MSME) పరిస్థితులపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎమ్ఎస్ఎమ్ఈలకు చెల్లించాల్సిన సుమారు రూ.8.1 లక్షల కోట్ల బకాయిలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితి వాటి వర్కింగ్ క్యాపిటల్, వ్యాపార వృద్ధిపై ప్రభావం చూపుతోందన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల గడువులోపు MSMEలకు బకాయిలు చెల్లించాలని ఆమె ఆదేశించారు. చిన్న పరిశ్రమలు బలపడితేనే మధ్యతరగతి అభివృద్ధి చెందుతుందని, అదే ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు.





