అల్లుడికి రూ.4 లక్షల వెండి కొల్హాపురి చెప్పులు గిఫ్ట్.. మహారాష్ట్రలో వైరల్!

మహారాష్ట్రలో ఓ మామ తన అల్లుడిపై చూపించిన ప్రేమ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధిక మాసం సందర్భంగా అల్లుడికి ఏకంగా రూ.4 లక్షల విలువైన వెండి కొల్హాపురి చెప్పులను బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఈ అరుదైన కానుకను అందించింది. అధిక మాసం సందర్భంగా అల్లుళ్లకు ప్రత్యేక బహుమతులు ఇవ్వడం అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే ఈసారి మాత్రం వెండితో తయారు చేసిన కొల్హాపురి చెప్పులు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
ఈ చెప్పులను తయారు చేయడానికి సుమారు కిలోన్నర స్వచ్ఛమైన వెండిని ఉపయోగించినట్లు సమాచారం. మార్కెట్ విలువ ప్రకారం వీటి ధర దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.4.25 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు.
సాంప్రదాయ కొల్హాపురి చెప్పుల మాదిరిగానే ఈ వెండి చెప్పులను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సాధారణంగా ధరించే చెప్పుల ఆకృతిలోనే ఉండేలా వాటిని తయారు చేయడం విశేషంగా మారింది.
ఈ ప్రత్యేక కళాఖండాన్ని కొల్హాపూర్‌కు చెందిన ఓ నైపుణ్యం కలిగిన కళాకారుడు రూపొందించినట్లు తెలుస్తోంది. ముందుగా ఒరిజినల్ కొల్హాపురి చెప్పును నమూనాగా తీసుకుని, దాని ఆకారాన్ని పూర్తిగా వెండిలో రూపొందించారు.
చెప్పుల సోల్, పట్టీలు, బొటనవేలు భాగం వంటి ప్రతి భాగాన్ని విడివిడిగా తయారు చేసి తర్వాత వాటిని జత చేసినట్లు సమాచారం. వీటిని కేవలం ప్రదర్శన కోసం మాత్రమే కాకుండా ధరించేందుకు కూడా వీలుగా బలంగా తయారు చేశారు.
ప్రస్తుతం ఈ వెండి చెప్పుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు దీనిని “రాయల్ గిఫ్ట్”గా అభివర్ణిస్తుండగా, మరికొందరు సంప్రదాయాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే ప్రయత్నంగా ప్రశంసిస్తున్నారు.
బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన సమయంలో ఇంత ఖరీదైన బహుమతి ఇవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.





