లేడీస్ హాస్టల్లో దారుణం.. విద్యార్థినులపై యజమాని కొడుకు దాడి, వైరల్ వీడియోతో కలకలం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహిళల భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రైవేట్ లేడీస్ హాస్టల్లోకి అక్రమంగా చొరబడిన హాస్టల్ యజమాని కుమారుడు ఇద్దరు విద్యార్థినులపై దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రయాగ్‌రాజ్‌లోని శంకర్ ఘాట్ ప్రాంతంలో ఉన్న ఓ లేడీస్ హాస్టల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వైరల్ వీడియోలో నిందితుడు గదిలోకి బలవంతంగా ప్రవేశించి ఇద్దరు యువతులను దాడి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారిలో ఒక విద్యార్థినిని జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చుకెళ్తున్న సమయంలో అక్కడ ఉన్న వృద్ధురాలు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు వీడియోలో కనిపించింది.
బాధితుల వివరాల ప్రకారం, నిందితుడు కొంతకాలంగా హాస్టల్లో ఉంటున్న యువతులను ఫోన్ కాల్స్, అసభ్యకరమైన మెసేజ్‌లతో వేధిస్తున్నాడని ఆరోపించారు. మద్యం మత్తులో తరచూ ఇబ్బందులకు గురిచేస్తుండటంతో బాధితులు అతని కాల్స్‌కు స్పందించడం మానేశారని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన నిందితుడు మే 18న నేరుగా వారి గది వద్దకు వెళ్లి తలుపులు బలంగా కొట్టినట్లు సమాచారం. భయంతో తలుపు తీయకపోవడంతో బయట నుంచి గదికి తాళం వేసినట్లు బాధితులు వెల్లడించారు. అనంతరం అతని తల్లి అక్కడికి చేరుకుని తాళం తీసిన వెంటనే నిందితుడు లోపలికి దూసుకెళ్లి దాడికి పాల్పడ్డాడని తెలిపారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. వైరల్ వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన మహిళల భద్రత, ప్రైవేట్ హాస్టళ్లలో భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. విద్యార్థినులపై వేధింపులు, దాడుల ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.





