నెల్లూరులో తెల్లవారుజామున పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్.. 30 వాహనాలు స్వాధీనం

నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడంపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ అజిత వెజెండ్ల ఆదేశాల మేరకు దగదర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఉదయం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు దగదర్తి పరిధిలోని లైన్స్ నగర్ కాలనీలో ఈ తనిఖీలు చేపట్టారు. కావలి రూరల్ సర్కిల్ సీఐ శివశంకర్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో దగదర్తి ఎస్సై జపాన్ కుమార్, బిట్రగుంట ఎస్సై రామకృష్ణ, అల్లూరు ఎస్సై శ్రీనివాసులు రెడ్డి మరియు మూడు పోలీస్ స్టేషన్‌ల సిబ్బంది పాల్గొన్నారు.
ఈ తనిఖీల్లో భాగంగా కాలనీలోని ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ముఖ్యంగా సమీప పరిశ్రమల్లో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారి వివరాలను పోలీసులు నమోదు చేశారు.
డిజిటల్ మ్యాపింగ్ సాయంతో క్రైమ్ స్పాట్స్ గుర్తింపు, రౌడీషీటర్లు, పరారీ నిందితులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు, గంజాయి మరియు ఇతర నిషేధిత పదార్థాల సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పోలీసులు తెలిపారు.
తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహన యజమానులు అవసరమైన పత్రాలు సమర్పించి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. పత్రాలు లేని వాహనాలపై మోటార్ వెహికిల్స్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదేవిధంగా ప్రజలకు నేరాల నివారణ, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. ప్రాంతంలో అక్రమ కార్యకలాపాలు లేదా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఇలాంటి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ఎస్పీ అజిత వెజెండ్ల తెలిపారు.





