హంసవాహనంపై సరస్వతి స్వరూపుడై భక్తులను కటాక్షించిన గోవిందరాజస్వామి

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం రాత్రి హంసవాహన సేవ భక్తి పారవశ్యంతో వైభవంగా జరిగింది. సరస్వతి దేవి అలంకారంలో శ్రీ గోవిందరాజస్వామివారు హంసవాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచారు.

రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఈ వాహనసేవలో తిరుపతి మాడవీధులు గోవింద నామస్మరణలతో మారుమోగాయి. వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తబృందాలు చెక్కభజనలు, కోలాటాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి.

మంగళవాయిద్యాల నడుమ స్వామివారి హంసవాహన సేవను తిలకించిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి పరవశించారు. తిరుపతి బ్రహ్మోత్సవాల్లో ఈ వాహనసేవ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

హంసవాహనం ఆధ్యాత్మిక ప్రాధాన్యం

పురాణాల ప్రకారం హంస జ్ఞానానికి, వివేకానికి ప్రతీకగా భావించబడుతుంది. పాలను నీటిని వేరుచేసే హంస స్వభావం ఆత్మానాత్మ వివేకానికి సంకేతమని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తాయి. అందుకే పరమాత్మతో ఏకత్వం పొందిన మహనీయులను “పరమహంసులు”గా ఉపనిషత్తులు పేర్కొంటాయి.

భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తిని ప్రసాదించేందుకే శ్రీహరి హంసవాహనాన్ని అధిరోహిస్తాడని విశ్వాసం.

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనుంజయులు, ఆలయ అర్చకులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button