శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు.. భక్తులకు మూలమూర్తి దర్శనం కల్పించాలి: జేఈవో వీరబ్రహ్మం

తిరుపతిలోని ప్రముఖ వైష్ణవక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ నెల మే 23న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు, మే 31న ధ్వజావరోహణంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధల నడుమ రాజీలేని విధంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భక్తులకు వాహనసేవలతో పాటు మూలమూర్తి దర్శనం కూడా సాఫీగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఆలయ పరిసరాలను అందంగా తీర్చిదిద్దేందుకు ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక పుష్పాలంకరణలు చేపట్టనున్నారు. అలాగే ఇంజినీరింగ్ విభాగం ద్వారా క్యూలైన్లు, చలువ పందిళ్లు, కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంతమంతా విద్యుద్దీపాలతో అలంకరించి, ప్రత్యేక ఆర్చీలు, కటౌట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

భక్తుల సేవలో భాగంగా అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని జేఈవో సూచించారు. ఇక హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత నృత్య కళాశాలల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వాహనసేవలకు ముందు భజనలు, కోలాటాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని ఆరోగ్య విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు, అగ్నిమాపక సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

బ్రహ్మోత్సవాల సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా టిటిడి విజిలెన్స్, పోలీస్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button