ప్రకాశ్ రాజ్ ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ వీడియో వైరల్.. సోషల్ మీడియాలో కొత్త రాజకీయ సెటైర్ హల్‌చల్

వైవిధ్యభరిత పాత్రలతో గుర్తింపు పొందిన నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్న ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP) పేరుతో సాగుతున్న వ్యంగ్య డిజిటల్ ఉద్యమంలో ఆయన భాగస్వామ్యం కావడం ఇప్పుడు వైరల్‌గా మారింది.
తాజాగా ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో ఆయన ఐస్‌క్రీమ్‌తో పాటు మామిడి పండు గుజ్జును కలుపుకుని తింటూ కనిపించారు. దీనికి జత చేసిన వ్యాఖ్యలు, హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.
“కాక్‌రోచ్ ఈటింగ్ మ్యాంగోస్.. యమ్మీ” అంటూ #CockroachJantaParty, #justasking హ్యాష్‌ట్యాగ్‌లతో వీడియోను పోస్ట్ చేసిన ప్రకాష్ రాజ్, వ్యంగ్య శైలిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. “బొద్దింకలు మామిడి పండ్లు ఎలా తింటాయో చూడండి” అనే వ్యాఖ్యతో వీడియోకు మరింత వైరల్ రీచ్ వచ్చింది.
61 ఏళ్ల ప్రకాష్ రాజ్ ఇప్పటికే ఈ డిజిటల్ ఉద్యమానికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవుతుండగా, వాటి పోస్టులను కూడా తరచుగా షేర్ చేస్తున్నారు. దీంతో యువతలో ఈ ట్రెండ్ మరింత వేగంగా వ్యాపిస్తోంది.
ఇక ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ ప్రభావం సినీ పరిశ్రమలో కూడా కనిపిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటీమణులు దియా మీర్జా, ఈషా గుప్తా, ఫాతిమా సనా షేక్, దర్శకుడు కునాల్ కోహ్లీ తదితరులు కూడా ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ అకౌంట్లను ఫాలో అవుతున్నారు.
ఈ వ్యంగ్య ప్రచారాన్ని డిజిటల్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దీప్కే ప్రారంభించినట్లు సమాచారం. బోస్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన ఆయన మే 16న ప్రారంభించిన ఇన్‌స్టాగ్రామ్ పేజీ కేవలం ఆరు రోజుల్లోనే 19 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించడం విశేషంగా మారింది.
మొదట సరదా సోషల్ మీడియా ట్రెండ్‌గా ప్రారంభమైన ఈ ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తూ వైరల్ ఫెనామెనాగా మారుతోంది.





