సింహవాహనంపై దివ్యంగా దర్శనమిచ్చిన శ్రీ గోవిందరాజస్వామి.. గోవింద నామస్మరణలతో మారుమోగిన తిరుపతి

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం ఉదయం సింహవాహన సేవ భక్తి వైభవంగా జరిగింది. శ్రీ గోవిందరాజస్వామివారు సింహవాహనంపై అభయహస్తంతో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి అనుగ్రహించారు.

ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ వాహనసేవలో తిరుపతి మాడవీధులు గోవింద నామస్మరణలు, వేదఘోషలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. వాహనం ముందు ఠీవిగా సాగిన గజరాజులు సేవకు మరింత మహోత్సవ శోభను తీసుకువచ్చాయి.

చెక్కభజనలు, కోలాటాలతో భక్తబృందాలు పాల్గొనగా, అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

సింహవాహనం ఆధ్యాత్మిక ప్రాధాన్యం

సింహం గాంభీర్యం, ధైర్యం, శక్తికి ప్రతీకగా భావించబడుతుంది. యోగశాస్త్రంలో సింహం వేగశక్తి, ఆత్మవిశ్వాసానికి సంకేతంగా పేర్కొంటారు. భక్తునిలో సింహబలంలాంటి అచంచల భక్తి కలిగినప్పుడు భగవంతుని కృప లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి.

అనంతతేజోమూర్తి అయిన శ్రీహరి రాక్షసుల హృదయాల్లో సింహస్వరూపుడిగా ప్రత్యక్షమవుతాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ధీరోదాత్తుడైన శ్రీ గోవిందరాజస్వామి సింహవాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తాడని విశ్వాసం.

వైభవంగా స్నపన తిరుమంజనం

అనంతరం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారు, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు సమర్పించారు.

రాత్రికి ముత్యపుపందిరి వాహన సేవ

సాయంత్రం ఊంజల్ సేవ అనంతరం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ముత్యాలు చంద్రుని చల్లదనానికి ప్రతీకగా భావించబడుతాయి. ముత్యపుపందిరిపై వెలసే స్వామివారి రూపం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రసాదిస్తుందని విశ్వాసం. సముద్రగర్భం ప్రసాదించిన ముత్యాల కింద శ్రీనివాసుని దర్శనం జీవితాల్లో శాంతి, చల్లదనాన్ని నింపుతుందని భక్తులు నమ్ముతారు.

ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎస్వో శ్రీ ఆర్. శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనుంజయరావు, శ్రీ రంజిత్‌, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button