ఒకే టికెట్‌పై మూడు రోజులు తిరుమల దర్శనం.. మే 21న పవిత్రోత్సవ టికెట్ల విడుదల

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అరుదైన అవకాశం కల్పిస్తోంది. ఒకే టికెట్‌పై వరుసగా మూడు రోజుల పాటు నాలుగు సార్లు శ్రీవారిని దర్శించుకునే ప్రత్యేక అవకాశం భక్తులకు లభించనుంది. తిరుమలలో నిర్వహించే వార్షిక పవిత్రోత్సవాల సందర్భంగా ఈ సౌకర్యాన్ని టీటీడీ అందిస్తోంది.
ఆగస్టు 23 నుంచి 25 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన టికెట్లను మే 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ ప్రత్యేక టికెట్‌ను ఇద్దరికీ కలిపి రూ.5,000 చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్ పొందిన భక్తులకు పవిత్రోత్సవాలు జరిగే మూడు రోజుల పాటు తిరుమలలో ఉండి ప్రత్యేక దర్శనం, సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా నిర్వహించే స్నపన తిరుమంజనం సేవలో పాల్గొనే అవకాశం కూడా భక్తులకు లభిస్తుంది. అలాగే చివరి రోజు నిర్వహించే పూర్ణాహుతిలో కూడా పాల్గొనవచ్చు.
ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద సంప్రదాయ వస్త్రధారణలో హాజరుకావాలి. ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ సూచించింది.
తిరుమలలో పవిత్రోత్సవాలను అత్యంత పవిత్రమైన దోష నివారణ ఉత్సవాలుగా భావిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, సేవలు, ఉత్సవాల్లో తెలియక జరిగే చిన్న చిన్న దోషాల నివారణ కోసం ఆగమ శాస్త్రం ప్రకారం ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాలు ఆగస్టు 22న అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. అనంతరం మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, పవిత్ర సమర్పణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
టీటీడీ విడుదల చేసే ఈ టికెట్లకు భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉండటంతో భక్తులు ముందుగానే తమ టీటీడీ ఖాతాలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
టికెట్లను కేవలం అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలని, ఇతర నకిలీ వెబ్‌సైట్లను నమ్మవద్దని టీటీడీ హెచ్చరించింది.





