నారాయణవనంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం

నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ శుద్ధి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు.
మే 28 నుంచి జూన్ 5వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ పవిత్రతను మరింత పెంపొందించే ఉద్దేశంతో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆలయ సంప్రదాయంగా కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలను కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

ఈ శుద్ధి మహోత్సవంతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
మే 28 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది.
ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు, ఆలయ అర్చకులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.





