చిన్నశేష వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి దివ్య దర్శనం.. గోవింద నామస్మరణలతో మారుమోగిన తిరుపతి

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి అనుగ్రహించారు.
ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ వాహనసేవలో తిరుపతి మాడవీధులు గోవింద నామస్మరణలతో మారుమోగాయి. ముందుగా గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తబృందాలు చెక్కభజనలు, కోలాటాలు, భక్తి గీతాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి.
మంగళవాయిద్యాల నడుమ చిన్నశేష వాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించగా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ దర్శించుకున్నారు. వాహనసేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

శ్రీవైష్ణవ సంప్రదాయంలో భగవంతుడిని “శేషి”, జగత్తును “శేషభూతం”గా భావిస్తారు. ఈ శేషశేషి తత్వానికి ప్రతీకగా చిన్నశేష వాహనం నిలుస్తుందని పండితులు చెబుతున్నారు. చిన్నశేష వాహనసేవను దర్శించుకున్న భక్తులకు కుండలినీ యోగసిద్ధి ఫలం లభిస్తుందనే ఆధ్యాత్మిక విశ్వాసం ఉంది.
అనంతరం ఉదయం 10 గంటల నుంచి ఆలయ కల్యాణమండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పండ్లరసాలతో స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు నిర్వహించగా భక్తులు భక్తి పరవశులయ్యారు.

సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించనుండగా, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హంస వాహనసేవ జరగనుంది. ఈ వాహనసేవలో స్వామివారు భక్తులకు మరోసారి దివ్య దర్శనం ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ నారాయణ చౌదరి, ఇతర అధికారులు, అర్చకులు మరియు భక్తులు పాల్గొన్నారు.






