వైభవంగా గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. మే 27న గరుడసేవ ప్రధాన ఆకర్షణ

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు నిర్వహించనున్న ఈ మహోత్సవాలకు శుక్రవారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదఘోషలు, మంగళవాయిద్యాలు, వైదిక మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తింది.
ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, సహస్రనామార్చన సేవలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సేనాధిపతి ఉత్సవం, ముఖ మండపంలో సమర్పణ, ఆస్థానం వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. యాగశాలలో నిర్వహించిన ప్రత్యేక పూజల అనంతరం అంకురార్పణ మహోత్సవం ఘనంగా జరిగింది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. వేసవి వేడిని దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, వైట్ పెయింట్, విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు, రంగోలీలతో ఆలయ పరిసరాలను అందంగా ముస్తాబు చేశారు.

బ్రహ్మోత్సవాల తొలి రోజు అయిన మే 23న ఉదయం 7.35 గంటల నుంచి 8.49 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణ మహోత్సవం నిర్వహించనున్నారు. ధ్వజస్తంభానికి తిరుమంజనం, పూజలు అనంతరం ధ్వజారోహణం జరగనుంది.
అదేవిధంగా ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం, ఆస్థానం కార్యక్రమాలు నిర్వహించగా, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామివారు తిరువీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం, రాత్రి వాహనసేవలు నిర్వహించనున్నారు. మే 27న జరిగే గరుడవాహన సేవ, మే 30న నిర్వహించే రథోత్సవం ఈ ఉత్సవాల ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.

ప్రధాన వాహన సేవల వివరాలు
- మే 24 – చిన్నశేష వాహనం, హంస వాహనం
- మే 25 – సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం
- మే 26 – కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం
- మే 27 – మోహినీ అవతారం, గరుడ వాహనం
- మే 28 – హనుమంత వాహనం, గజ వాహనం
- మే 29 – సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
- మే 30 – రథోత్సవం, అశ్వవాహనం
- మే 31 – చక్రస్నానం, ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి తదితర అధికారులు పాల్గొన్నారు.





