తిరుపతిలో 450 మంది రౌడీషీటర్లు, గంజాయి-పోక్సో నిందితులకు మెగా కౌన్సెలింగ్.. ఎస్పీ సుబ్బరాయుడు స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతి జిల్లాలో నేర నియంత్రణకు పోలీసులు మరింత కఠిన చర్యలు చేపడుతున్నారు. రౌడీయిజం, గంజాయి, మహిళలు మరియు చిన్నారులపై నేరాలను అరికట్టే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 450 మంది రౌడీషీటర్లు, గంజాయి కేసుల నిందితులు, దొంగతనాలకు పాల్పడే వ్యక్తులు, పోక్సో కేసుల ముద్దాయిలు హాజరయ్యారు.
జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నేరస్థులకు చివరి హెచ్చరిక జారీ చేశారు. “చట్టానికి లోబడి నడుచుకుంటే గౌరవిస్తాం.. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చట్టం విలువ చూపిస్తాం” అంటూ ఎస్పీ కఠిన హెచ్చరికలు చేశారు.
తిరుపతి వంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతంలో రౌడీయిజం, గంజాయి విక్రయాలు, మహిళలపై నేరాలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ అయితే ప్రతి కదలికపై పోలీసుల నిఘా ఉంటుందని, మళ్లీ నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్, జిల్లా బహిష్కరణ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటివరకు 257 NDPS షీట్లు, 184 POCSO షీట్లు ఓపెన్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. పదే పదే నేరాలకు పాల్పడుతున్న 13 మంది రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ నమోదు చేయగా, గంజాయి మరియు డ్రగ్స్ సరఫరా చేస్తున్న 17 మందిపై PITNDPS చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపినట్లు తెలిపారు.
కౌన్సెలింగ్లో భాగంగా గంజాయి వినియోగాన్ని గుర్తించే ఆధునిక యూరిన్ టెస్ట్ విధానంపై కూడా అవగాహన కల్పించారు. కేవలం ఐదు నిమిషాల్లో పరీక్ష ఫలితాలు వస్తాయని, గత 30 రోజుల వరకు గంజాయి వినియోగ చరిత్రను గుర్తించవచ్చని అధికారులు వివరించారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారి ద్వారా గంజాయి సరఫరా నెట్వర్క్ను పూర్తిగా గుర్తించి అణచివేస్తామని హెచ్చరించారు.

“మారితే ఆదరిస్తాం.. మళ్లీ నేరం చేస్తే చట్టం ఎలా ఉంటుందో చూపిస్తాం” అంటూ ఎస్పీ సుబ్బరాయుడు మరోసారి స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో రాజీ పడబోమని, తిరుపతిని నేర రహిత, గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.





