దివ్యకాంతులతో మెరిసిపోతున్న గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు.. తిరుపతిలో వైకుంఠ వాతావరణం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు దివ్య విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్నాయి. మే 23 నుంచి 31 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ చేపట్టిన ప్రత్యేక విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

శ్రీమహావిష్ణువు దశావతారాలను ప్రతిబింబించేలా రూపొందించిన విద్యుత్ అలంకరణలు తిరుపతి మాడవీధులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీ అనంతపద్మనాభస్వామి రూపంతో పాటు మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, బలరామావతారం, హనుమంతుని దివ్య రూపాలు విద్యుత్ కాంతుల్లో దర్శనమిస్తున్నాయి.

రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన వామనావతారం విద్యుత్ అలంకరణ భక్తులను ఆకట్టుకుంటుండగా, రాయలచెరువు గేట్ జంక్షన్ వద్ద బలరామావతారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బేరీవీధిలో పరశురామ అవతారం, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం వద్ద హనుమంతుని దివ్య రూపాలు భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తుతున్నాయి.

అదేవిధంగా శ్రీరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, కల్కి అవతారం రూపాలతో రూపొందించిన విద్యుత్ అలంకరణలు బ్రహ్మోత్సవాల వైభవాన్ని మరింత పెంచుతున్నాయి.

నాలుగు మాడవీధుల్లో విద్యుత్ ఆర్చ్‌లు, ఫ్లడ్‌లైట్లు, ప్రత్యేక తోరణాలు, నడకదారుల వెంట విద్యుత్ పందిళ్లు ఏర్పాటు చేశారు. వాహనసేవలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఈ ప్రత్యేక విద్యుత్ అలంకరణలతో తిరుపతి వైకుంఠాన్ని తలపించేలా మారిపోయిందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే వేలాది మంది భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా టీటీడీ ఎలక్ట్రికల్ శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో ఈ అలంకరణలు చేపట్టారు.

ప్రస్తుతం గోవిందరాజస్వామి ఆలయం పరిసరాలు భక్తి కాంతులతో మెరిసిపోతుండగా, రాత్రి వేళల్లో ఈ విద్యుత్ అలంకరణలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button