సర్వభూపాల వాహనంపై రాజాధిరాజుగా కల్యాణ వేంకటేశ్వరస్వామి.. శ్రీరామ పట్టాభిషేక అలంకారంలో దివ్య దర్శనం

నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి వైభవంతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో నాల్గవ రోజైన ఆదివారం రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై శ్రీరామ పట్టాభిషేక అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు.

శ్రీదేవి, భూదేవి సమేతంగా కాకుండా ఈ సందర్భంగా శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని స్మరింపజేసే విధంగా సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుని అలంకారంలో కొలువుదీరిన కల్యాణ శ్రీనివాసుడు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. అనంత తేజోమూర్తిగా వెలసిన స్వామివారు సర్వలోకాల పాలకుడిగా, రాజాధిరాజుగా సర్వభూపాల వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు.

వాహనసేవ సందర్భంగా ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణలతో మారుమోగాయి. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దాయి. మంగళవాయిద్యాల నడుమ సాగిన ఈ దివ్యోత్సవం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.

మార్గమధ్యంలో వేలాది మంది భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు పొందారు. స్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వాహనసేవ మొత్తం భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మిక ఉత్సాహంతో కొనసాగింది.

సర్వభూపాల వాహన సేవ విశిష్టత

సనాతన సంప్రదాయంలో “సర్వభూపాలులు” అంటే సమస్త రాజులు, పాలకులు అని అర్థం. ప్రజల సంక్షేమం కోసం ధర్మబద్ధంగా పాలన సాగించే రాజులందరికీ అధిపతి భగవంతుడే అనే సందేశాన్ని ఈ వాహనసేవ తెలియజేస్తుంది. జగన్నాయకుడైన శ్రీహరి సమస్త లోకాల పాలకుడిగా, రాజాధిరాజుగా సర్వభూపాల వాహనంపై దర్శనమివ్వడం ఈ ఉత్సవానికి ప్రత్యేకతగా నిలుస్తుంది.

ఈ వాహనసేవ ద్వారా ధర్మపాలన, న్యాయం, ప్రజాహితం వంటి విలువలను ఆచరించాలని భక్తులకు ఆధ్యాత్మిక సందేశం అందించబడుతుంది. అందుకే బ్రహ్మోత్సవాల్లో సర్వభూపాల వాహనసేవకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నాగరాజు, శ్రీ చెంగల్‌రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.
Back to top button