ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష.. తిరుపతి కోర్టు కీలక తీర్పు

తిరుపతి జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు కోర్టు జైలు శిక్ష విధించింది. 2014లో నమోదైన ఈ కేసును విచారించిన తిరుపతి జిల్లా ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు నిందితులకు రెండేళ్ల కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది.
యర్రావారిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి తరలిస్తున్న సమయంలో అప్పటి ఎస్ఐ శ్రీ ఎస్. రహీముల్లా మరియు పోలీసు సిబ్బంది నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కేసును సుదీర్ఘంగా విచారించిన ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి శ్రీ ఏ. నరసింహమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
కోర్టు ఆదేశాల ప్రకారం నిందితులు జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
ఈ కేసులో శిక్ష పడిన నిందితులు ఎస్. చలపతి (57), యర్రావారిపాలెం మండలం బోడెవండ్లపల్లి గ్రామానికి చెందినవారు కాగా, బి. సుబ్రహ్మణ్యం (33), ఓఎస్ గొల్లపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు.
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ పర్యవేక్షణలో అమలు చేసిన “గుడ్ ట్రయల్ మానిటరింగ్” విధానం కారణంగా కేసును బలంగా నడిపించగలిగామని అధికారులు పేర్కొన్నారు. నిందితులు కొంతకాలం కోర్టుకు గైర్హాజరుకావడంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిన కోర్టు, వారు మే 18న లొంగిపోయిన అనంతరం రిమాండ్ విధించింది. అనంతరం గురువారం తుది తీర్పు వెలువడింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, అటవీ సంపదను దోచుకునే వారికి ఈ తీర్పు గట్టి హెచ్చరికగా నిలుస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీస్ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.
కేసు దర్యాప్తు, కోర్టు సమన్వయం, పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించిన చంద్రగిరి డీఎస్పీ శ్రీ బేతపూడి ప్రసాద్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ ఏ. అమరనారాయణ, అప్పటి ఎస్ఐ రహీముల్లా, ప్రస్తుత భాకరాపేట సీఐ శ్రీ టి.వి. సత్యనారాయణ, ఎస్ఐ బి.వి. లోకేష్, కోర్టు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.





