తిరుపతి జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం.. గాజులమండ్యంలో బయో-చెక్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు

తిరుపతి జిల్లా గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి నిర్మూలన లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక అవగాహన మరియు తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ మరియు తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
అదనపు ఎస్పీ (క్రైమ్స్) శ్రీ ఆర్ల శ్రీనివాస్ నాయకత్వంలో, రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గంజాయి వినియోగ నిరోధంపై ప్రత్యేక దృష్టి సారించారు.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు ప్రత్యేక బయో-చెక్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 65 మందికి గంజాయి వినియోగ నిర్ధారణ పరీక్షలు చేసి, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై చట్టపరమైన అవగాహన కల్పించారు.

పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం గంజాయి వినియోగదారులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ అందించడం. అవసరమైతే వారిని రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించి మత్తు వ్యసనాల నుండి బయటపడేలా చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
అదేవిధంగా గంజాయి వినియోగదారుల ద్వారా సమాచారం సేకరించి సరఫరాదారులు, అక్రమ రవాణాదారులు, అమ్మకందారులను గుర్తించి వారి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో గంజాయి సరఫరా వ్యవస్థను పూర్తిగా అణచివేయడానికి ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని పోలీస్ అధికారులు సూచించారు. సమాజంలో మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజల సహకారం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు, గాజులమండ్యం సీఐ శ్రీ మంజునాథ్ రెడ్డి, ఎస్ఐ శ్రీ హరీష్, హెడ్ కానిస్టేబుల్ మణి, పీసీలు శివ, రాజశేఖర్, బారుష, మణి తదితర సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి ఈగల్ టీమ్ సీఐ శ్రీ ప్రసాద్ మరియు వారి సిబ్బంది కూడా కార్యక్రమంలో పాల్గొని తనిఖీలు నిర్వహించారు.





