మిథున లగ్నంలో వైభవంగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. పెద్దశేష వాహనసేవకు భక్తుల ఆసక్తి

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం మిథున లగ్నంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదఘోషలు, మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య నిర్వహించిన ధ్వజారోహణ మహోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది.

ఉదయం 7.35 గంటల నుంచి 8.49 గంటల మధ్య గరుడ చిత్రంతో అలంకరించిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించి బ్రహ్మోత్సవాలకు శుభారంభం పలికారు. అనంతరం స్వామివారి ఆస్థానం వైభవంగా నిర్వహించారు.

ధ్వజారోహణానికి ముందు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, చక్రత్తాళ్వార్‌, ధ్వజపటం, పరివార దేవతలు వెండి తిరుచ్చిపై నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారే స్వయంగా పర్యవేక్షిస్తారనే విశ్వాసం భక్తులను ఆకట్టుకుంది.

అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షాబంధనం వంటి వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మిథున లగ్నంలో నిర్వహించిన ధ్వజారోహణంతో ముక్కోటి దేవతలకు బ్రహ్మోత్సవాల ఆహ్వానం పలికినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

తదుపరి ఉదయం 10.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో నిర్వహించిన అభిషేకాలను తిలకించిన భక్తులు భక్తి పరవశులయ్యారు.

సాయంత్రం 5.30 గంటల నుంచి ఊంజల్ సేవ నిర్వహించనుండగా, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామివారు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వాహనసేవను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఆలయ పరిసరాలను చలువ పందిళ్లు, రంగవల్లులు, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలతో ఆధ్యాత్మిక వాతావరణంలో ముస్తాబు చేసింది.

అదేవిధంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button