తిరుపతి పోలీసుల భారీ మొబైల్ రికవరీ.. రూ.1 కోటి విలువైన 500 ఫోన్లు బాధితులకు అప్పగింత

తిరుపతి జిల్లా పోలీసులు మరోసారి తమ పనితీరుతో ప్రశంసలు అందుకున్నారు. “మొబైల్ రికవరీ మేళా” కార్యక్రమంలో భాగంగా 14వ దశలో సుమారు రూ.1 కోటి విలువైన 500 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు.
సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ సహాయంతో ఈ మొబైల్ ఫోన్లను గుర్తించి తిరిగి యజమానులకు అప్పగించారు. ఇప్పటివరకు 13 దశల్లో మొత్తం రూ.10 కోట్ల 52 లక్షల 70 వేల విలువైన 4,785 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ఐపీఎస్ వెల్లడించారు.
తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో కీలక భాగంగా మారిందన్నారు. ఫోన్ పోయినప్పుడు ప్రజలు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఇంటి నుంచే CEIR సేవల ద్వారా ఫిర్యాదు నమోదు చేసే సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా పోయిన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి రికవరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సైబర్ క్రైమ్ విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు.
మొబైల్ పోగొట్టుకున్న వారు 9490617873 వాట్సాప్ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపడం ద్వారా CEIR లింక్ పొందవచ్చని తెలిపారు. ఆ లింక్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయడంతో పాటు పూర్తి సాంకేతిక సహాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
CEIR పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ IMEI నంబర్‌ను బ్లాక్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఆ ఫోన్ వినియోగాన్ని నిలిపివేయవచ్చని చెప్పారు. దీంతో ఫోన్ ట్రాకింగ్ మరింత సులభమవుతుందని తెలిపారు. మొబైల్ తిరిగి లభించిన తర్వాత అదే పోర్టల్ ద్వారా అన్‌బ్లాక్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు.

ప్రజలు తమ మొబైల్ ఫోన్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. మొబైల్ పోయిన వెంటనే సిమ్ కార్డును బ్లాక్ చేయించుకోవాలని, వెంటనే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని చెప్పారు.
అలాగే PhonePe, Google Pay, Paytm వంటి యాప్‌లకు బలమైన పాస్‌వర్డ్లు ఉపయోగించాలని, వ్యక్తిగత వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని హెచ్చరించారు. అనధికారికంగా మొబైల్ ఫోన్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరుపతి సైబర్ క్రైమ్ విభాగం సీఐ శ్రీ ఆర్. వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మొబైల్ ట్రాకింగ్, రికవరీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా మొబైల్ రికవరీలో ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ సిబ్బందికి అప్రిషియేషన్ సర్టిఫికెట్లు అందజేసి ఎస్పీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటరావు (పరిపాలన), సైబర్ సెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





