వరంగల్‌లో ట్రాఫిక్ సమస్యలపై సీపీ ఫోకస్.. కొత్త పార్కింగ్ స్థలాలపై క్షేత్రస్థాయి పరిశీలన

ట్రై సిటీ పరిధిలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్ ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. హనుమకొండ, వరంగల్ ప్రధాన ప్రాంతాల్లో వాహన పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు గురువారం సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హనుమకొండలోని అశోక్ జంక్షన్‌, హనుమకొండ చౌరస్తా, ఏనుగులగడ్డ ప్రాంతాలతో పాటు వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్‌, హెడ్ పోస్టాఫీస్ ప్రాంతాలను సీపీ సందర్శించారు. ఈ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, అందుబాటులో ఉన్న స్థల విస్తీర్ణంపై ట్రాఫిక్ అధికారులు, మున్సిపల్ సిబ్బందితో సమగ్రంగా చర్చించారు.

ప్రధాన రహదారులపై నియంత్రణ లేకుండా వాహనాలు పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమవుతోందని సీపీ పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాపార సముదాయాలు, షాపింగ్ మాల్స్ ముందు వాహనాలు నిలిపివేయకుండా భవనాల సెల్లార్లలోనే పార్కింగ్ ఏర్పాటు చేసేలా సంబంధిత వ్యాపారులను ట్రాఫిక్ అధికారులు ఆదేశించాలని సూచించారు.

ఈ చర్యల ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీని కొంతవరకు తగ్గించవచ్చని, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా వాతావరణం కల్పించడమే ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ తెలిపారు. భవిష్యత్తులో ట్రాఫిక్ నియంత్రణ కోసం మరిన్ని ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, ట్రైనీ ఐపీఎస్ మనీషా నేహ్రా, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు వెంకన్న, సుజాత, హనుమకొండ మరియు మట్టెవాడ ఇన్‌స్పెక్టర్లు శివకుమార్, కరుణాకర్‌తో పాటు ట్రాఫిక్ ఎస్‌ఐలు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button