‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహ్మద్ కాలా బాషా మృతి

సోషల్ మీడియాలో ఒక్క డైలాగ్‌తో సంచలనం సృష్టించిన ‘కుర్చీ తాత’ అలియాస్ మహ్మద్ కాలా బాషా ఇక లేరు. 66 ఏళ్ల బాషా తీవ్ర అనారోగ్యంతో బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఇటీవల ఎండదెబ్బ కారణంగా ఆయన ఆరోగ్యం మరింత విషమించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మంగళవారం సాయంత్రం కృష్ణకాంత్ పార్క్ ప్రాంతంలో నడుస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడున్న వారు వెంటనే CPR చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అనంతరం కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లగా, బుధవారం సాయంత్రం భార్య ఒడిలోనే తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
వరంగల్ జిల్లా కరీమాబాద్‌కు చెందిన మహ్మద్ కాలా బాషా జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చారు. భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నప్పటికీ ఆయన జీవితం ఎక్కువగా నగర వీధులకే పరిమితమైంది. బోరబండ ప్రాంతంలో నివసిస్తూ యూసుఫ్‌గూడ, కృష్ణకాంత్ పార్క్ పరిసరాల్లో తిరుగుతూ భిక్షాటన చేసేవారు.
ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో కుటుంబ గొడవ గురించి మాట్లాడుతుండగా ఆయన చెప్పిన “ఆ కుర్చీని మడతబెట్టి…” అనే డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. మీమ్స్, రీల్స్ ద్వారా ఆ మాట దేశవ్యాప్తంగా ట్రెండ్ అయి, మహ్మద్ పాషాను ‘కుర్చీ తాత’గా గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఆ డైలాగ్ ప్రభావం అంతగా పెరగడంతో దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు థమన్ కలిసి ‘గుంటూరు కారం’ సినిమాలోని ఒక పాటలో ఆ డైలాగ్‌ను వినియోగించారు. మహేష్ బాబు నటించిన ఆ పాట భారీగా వైరల్ కావడంతో ‘కుర్చీ తాత’ పేరు మరింత ప్రాచుర్యం పొందింది. అప్పట్లో చిత్ర యూనిట్ నుంచి ఆయనకు ఆర్థిక సహాయం కూడా అందినట్లు సమాచారం.
కొంతకాలం సోషల్ మీడియా ద్వారా గుర్తింపు, సహాయం లభించినప్పటికీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. యూట్యూబ్ ఇంటర్వ్యూలు తగ్గిపోవడం, ఆరోగ్య సమస్యలు, మద్యం అలవాటు కారణంగా ఆయన మళ్లీ ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
గతంలో ఆయన మరణించారనే పుకార్లు కూడా వైరల్ కాగా, అప్పట్లో తానే స్వయంగా మీడియా ముందుకు వచ్చి వాటిని ఖండించారు. అయితే ఈసారి నిజంగానే ఆయన మరణించడంతో సోషల్ మీడియాలో అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.





