శ్రీవారి దర్శనం టికెట్లు పేరుతో భారీ మోసం.. టీటీడీ ఉద్యోగినని చెప్పి భక్తుల నుంచి లక్షలు వసూలు చేసిన వ్యక్తి అరెస్ట్

తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పిస్తామని చెప్పి అమాయక భక్తులను మోసం చేస్తున్న వ్యక్తులపై తిరుపతి పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. సోషల్ మీడియా మరియు ఫోన్ కాల్స్ ద్వారా తనను టీటీడీ ఉద్యోగిగా పరిచయం చేసుకుని భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి శ్రీ మురళీకృష్ణ ఐపీఎస్ పర్యవేక్షణలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీవారి దర్శనం టికెట్లు, వసతి గదులు ఏర్పాటు చేస్తామని చెప్పి భక్తులను మోసం చేస్తున్న నిందితుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల దర్యాప్తులో పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం లింగంగుంట గ్రామానికి చెందిన బొడపాటి నవీన్ చౌదరి అనే వ్యక్తి ఈ మోసాలకు పాల్పడినట్లు తేలింది. 33 సంవత్సరాల వయస్సు కలిగిన నిందితుడు సోషల్ మీడియా మరియు ఫోన్ కాల్స్ ద్వారా తనను టీటీడీ ఉద్యోగిగా పరిచయం చేసుకుని, ఎంప్లాయీస్ కోటాలో ప్రత్యేక దర్శనం టికెట్లు ఇప్పిస్తానని భక్తులను నమ్మించేవాడని పోలీసులు వెల్లడించారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలో పనిచేస్తున్న సూర్యకళ అనే మహిళను నిందితుడు టార్గెట్ చేశాడు. ఈ ఏడాది మార్చి నెలలో ఆరుగురికి శ్రీవాణి దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తానని చెప్పి పలు దఫాలుగా యూపీఐ ద్వారా రూ.47 వేల రూపాయలు తీసుకున్నాడు. అనంతరం తిరుమలకు వచ్చిన తర్వాత మరో రూ.18 వేల నగదు స్వీకరించి మొత్తం రూ.65 వేల రూపాయలు వసూలు చేసినప్పటికీ ఎలాంటి దర్శనం టికెట్లు ఏర్పాటు చేయకుండా మోసం చేసినట్లు విచారణలో బయటపడింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. విచారణలో భాగంగా పల్నాడు జిల్లాలో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడి వద్ద నుంచి రూ.45 వేల నగదు, ఒక Redmi కంపెనీ వైట్ కలర్ మొబైల్ ఫోన్, రెండు బ్యాంక్ పాస్‌బుక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్‌లోని యూపీఐ లావాదేవీలను పరిశీలించగా బాధితుల నుంచి డబ్బులు బదిలీ అయిన ఆధారాలు లభించినట్లు వెల్లడించారు.

అలాగే నిందితుడి బ్యాంక్ లావాదేవీలను పరిశీలించగా దాదాపు రూ.10 లక్షలకు పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 2021 నుంచి 2026 మధ్య గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో నిందితుడిపై నాలుగు చీటింగ్ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, అతని గత నేర చరిత్రను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, భక్తులు దర్శనం టికెట్లు, వసతి గదుల కోసం సోషల్ మీడియా ప్రకటనలు లేదా ఫోన్ కాల్స్ నమ్మి డబ్బులు చెల్లించవద్దని సూచించారు. శ్రీవారి దర్శనం, వసతి టికెట్లు కేవలం అధికారిక టీటీడీ వెబ్‌సైట్ మరియు అనుమతించబడిన కేంద్రాల ద్వారానే పొందాలని హెచ్చరించారు. అనుమానాస్పద లావాదేవీలు లేదా వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భక్తులకు సూచించారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button