నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్.. బియ్యం లారీని అడ్డుకుని రూ.80 వేల వసూళ్లు

హైదరాబాద్‌లో నకిలీ పోలీసుల ముఠా బీభత్సం సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీసులమంటూ బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీని అడ్డగించి డబ్బులు వసూలు చేసిన ఏడుగురు సభ్యుల గ్యాంగ్‌ను మీర్‌పేట్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం అరెస్టైన నిందితులు ఏకా సందీప్ కుమార్ (26), దేవర శెట్టి గిరీష్ (35), బీరం శివారెడ్డి (24), రాకేష్ సింగ్ (30), గంటల సాయిరాం రెడ్డి (24), కాకర్ల పవన్ సాయి (24)గా గుర్తించారు. ఆనంద్ అనే మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ముఠా కలిసి ఒక బియ్యం లారీని అడ్డుకుని తమను స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ సిబ్బందిగా పరిచయం చేసుకున్నారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్నారని బెదిరిస్తూ లారీ సిబ్బందిని భయపెట్టారు. ఈ క్రమంలో రూ.80 వేల నగదు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అంతటితో ఆగకుండా మరో రూ.80 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించినట్లు దర్యాప్తులో తేలింది.
బాధితుల ఫిర్యాదు మేరకు మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సమాచారం ఆధారంగా ముఠాను గుర్తించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి. శోభన్ మాట్లాడుతూ, ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేసే ఇలాంటి నకిలీ పోలీసు ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.
ఇటీవల హైదరాబాద్ నగరంలో నకిలీ అధికారుల పేరుతో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఎవరైనా పోలీసులమని చెప్పి తనిఖీలు చేస్తే వారి ఐడీ కార్డులు పరిశీలించాలని, అనుమానం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.





