ఏపీలో ఉచిత బస్సు పథకం రద్దు కాదు.. సోషల్ మీడియా ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం “స్త్రీ శక్తి” రద్దు కానుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. ఈ పథకాన్ని రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని క్లారిటీ ఇచ్చింది.
ఇటీవల డీజిల్ బస్సుల స్థానంలో ఈ-బస్సులు ప్రవేశపెట్టడంతో ఉచిత ప్రయాణ పథకం నిలిపివేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ అధికారికంగా స్పందించింది.
ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో “స్త్రీ శక్తి” పథకాన్ని రద్దు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కొనసాగుతుందని వెల్లడించింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు గుర్తుచేసింది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా లక్షలాది మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపింది. ఇటీవల దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని విస్తరించినట్లు పేర్కొంది.
ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం గత 9 నెలల్లో మహిళలు ఏకంగా 67 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారు. ఈ పథకం అమలుకు సంబంధించిన రూ.2,350 కోట్ల సబ్సిడీ భారం ప్రభుత్వమే భరిస్తోందని తెలిపింది. ఇప్పటికే రూ.720 కోట్లను ఆర్టీసీకి తిరిగి చెల్లించినట్లు వెల్లడించింది.
స్త్రీ శక్తి పథకం వల్ల ఆర్టీసీకి కూడా లాభం చేకూరిందని ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ 60 శాతం నుంచి 92 శాతానికి పెరిగిందని తెలిపింది. మహిళలతో పాటు టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించే పురుషుల సంఖ్య కూడా 40 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించింది.
అలాగే మహిళలు ప్రైవేట్ వాహనాల బదులుగా ఆర్టీసీ బస్సులను ఎక్కువగా వినియోగించడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మహిళల మరణాలు 39 శాతం తగ్గినట్లు పోలీసుల అధ్యయనంలో తేలిందని ప్రభుత్వం పేర్కొంది.
ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో 1,450 కొత్త ఈవీ బస్సులను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త బస్సుల రాక కేవలం ప్రయాణికుల సౌకర్యాల కోసమేనని, ఉచిత ప్రయాణ పథకం రద్దుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీ మేరకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ప్రభుత్వం తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రద్దు వార్తలు కేవలం అపోహలేనని ప్రజలు నమ్మవద్దని సూచించింది.





