న్యాయం చేస్తానంటూ దగ్గరై మోసం.. మహిళను గర్భవతిని చేసిన సీఐపై కేసు

తెలంగాణలో సంచలనం రేపిన ఘటన ఖమ్మంలో వెలుగులోకి వచ్చింది. భర్త వేధింపులపై న్యాయం కోరుతూ మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ వివాహితను సీఐ ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. బాధితురాలు చేసిన ఫిర్యాదు ఆధారంగా సీఐ రాజు నాయక్‌పై కేసు నమోదు చేయగా, ఉన్నతాధికారులు ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో సీఐగా పనిచేస్తున్న సమయంలో బానోత్ రాజు నాయక్ వద్దకు ఓ వివాహిత తన భర్త వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది.
భర్త నుంచి న్యాయం చేస్తానంటూ ఆమెకు ధైర్యం చెప్పిన సీఐ, అనంతరం ఫిర్యాదు పత్రంలోని ఫోన్ నంబర్ తీసుకుని తరచూ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేయడం ప్రారంభించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
క్రమంగా ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరైన సీఐ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరైనట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో తాను గర్భవతి అయ్యానని, పెళ్లి గురించి ప్రశ్నించగా బలవంతంగా టాబ్లెట్లు ఇచ్చి గర్భస్రావం జరిగేలా చేశాడని ఆరోపించింది.
అయితే ఆ తర్వాత కూడా పెళ్లి విషయాన్ని తప్పించుకుంటూ వస్తుండటంతో బాధితురాలు ఈ నెల 7న ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా సీఐ వేధింపులకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.
దీంతో ఉన్నతాధికారులు సీఐ రాజు నాయక్‌పై చర్యలు తీసుకుంటూ హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఘటనపై మరింత లోతుగా విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇక బాధితురాలికి ఇటీవలే కోర్టు ద్వారా భర్త నుంచి విడాకులు మంజూరైనట్లు సమాచారం. ఆమెకు విడాకులు ఇప్పించేందుకు కూడా సీఐ తన అధికారాన్ని వినియోగించి ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటన తెలంగాణ పోలీస్ వ్యవస్థలో కలకలం రేపింది. మహిళలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న పోలీస్ అధికారి పైనే ఇలాంటి ఆరోపణలు రావడం తీవ్ర చర్చకు దారితీసింది.





