వరంగల్ రైల్వే స్టేషన్లలో 24 గంటల పోలీస్ నిఘా.. అంతర్‌రాష్ట్ర దొంగలపై ప్రత్యేక ఆపరేషన్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల పెరుగుతున్న ఇండ్ల చోరీలు, చైన్ స్నాగ్ ఘటనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నేరగాళ్లు రైలు మార్గాలను వినియోగిస్తూ వరంగల్, కాజీపేట ప్రాంతాల్లో నేరాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలడంతో పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు.

దేశంలోని పలు రాష్ట్రాలను కలిపే ప్రధాన రైల్వే కేంద్రాలుగా వరంగల్, కాజీపేట స్టేషన్లు మారడంతో అంతర్‌రాష్ట్ర నేరగాళ్లు ఈ మార్గాలను ఉపయోగిస్తున్నారని పోలీసులు గుర్తించారు. నేరాలకు పాల్పడిన అనంతరం అదే రైలు మార్గాల ద్వారా తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా క్రైమ్స్ అదనపు డీసీపీ బాలస్వామి, సీసీఎస్ ఏసీపీ సదయ్య పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.

ఈ బృందాలు వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సహకారంతో 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి వచ్చే రైళ్లలో ప్రయాణించే అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు.

ప్రత్యేక బృందాలు అనుమానిత ప్రయాణికులను గుర్తించి వారి సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. అనంతరం వారి వేలిముద్రలు, ముఖచిత్రాలను ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ సహాయంతో దేశవ్యాప్తంగా ఉన్న క్రిమినల్ డేటాబేస్‌తో అనుసంధానం చేసి పరిశీలిస్తున్నారు.

ఈ ఆధునిక సాంకేతికత ద్వారా గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తుల వివరాలు క్షణాల్లో పోలీసులకు అందుతున్నాయి. దీంతో అనుమానితులను వెంటనే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అదేవిధంగా తనిఖీల సమయంలో సేకరించిన అనుమానితుల వివరాలను రికార్డుల రూపంలో భద్రపరుస్తున్నారు. నాలుగు ప్రత్యేక బృందాలు షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వహిస్తూ రైల్వే స్టేషన్లలో నిరంతర తనిఖీలు చేపడుతున్నాయి.

ఈ చర్యల ద్వారా అంతర్‌రాష్ట్ర దొంగల కదలికలను అడ్డుకుని నగరంలో నేరాలను నియంత్రించడమే లక్ష్యమని వరంగల్ పోలీసులు తెలిపారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button