బావుల్లో నీటికి బదులు డీజిల్.. మంగళూరులో కలకలం రేపిన షాకింగ్ ఘటన

కర్ణాటకలోని తీరప్రాంత నగరం మంగళూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బావుల్లో నీటికి బదులు డీజిల్ బయటకు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కావూర్ ప్రాంతంలోని మూడు ఇళ్ల బావుల నుంచి అకస్మాత్తుగా డీజిల్ కలిసిన ద్రవం రావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు, ఇంధన సంక్షోభంపై చర్చలు జరుగుతున్న వేళ మంగళూరులో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. సాధారణంగా నీళ్లు వచ్చే బావుల్లో నుంచి ఘాటైన డీజిల్ వాసన రావడంతో మొదట స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.
బాధితులు బావి నీటిని ప్రయోగశాలకు పంపగా నివేదికలు మరింత కలవరపరిచాయి. పరీక్షల్లో బావి నీటిలో ఏకంగా 28 శాతం స్వచ్ఛమైన డీజిల్ ఉన్నట్లు తేలింది. ఇతర మలినాలు పెద్దగా లేకపోయినా భారీ స్థాయిలో డీజిల్ కలిసినట్లు అధికారులు గుర్తించారు.
స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం బావి నుంచి తీసిన నీటిలో ఒక కాగితం ముంచి నిప్పు పెట్టగానే అది పెట్రోల్ పోసినట్లుగా భగ్గుమంటోంది. దీంతో బావుల పరిసర ప్రాంతాల్లో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందనే భయం నెలకొంది.

బాధితుల్లో ఒకరైన సదాశివ మాట్లాడుతూ బావిని ఎన్నిసార్లు తోడి శుభ్రం చేసినా మళ్లీ డీజిల్ పొర నీటిపైకి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాగునీటితో పాటు సాధారణ అవసరాలకు కూడా నీళ్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
“బావి దగ్గరికి వెళ్లగానే ఘాటైన వాసన వస్తోంది. నీళ్లు పూర్తిగా వాడలేని పరిస్థితి. ఇప్పుడు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించుకుని బకెట్లలో నిల్వ చేసుకుంటున్నాం” అంటూ ఆయన వాపోయారు.
ఈ ఘటనకు సమీపంలోని పెట్రోల్ బంక్ భూగర్భ ట్యాంక్ లీకేజీయే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. బావులకు అతి సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో అక్కడి నుంచి డీజిల్ భూగర్భ జలాల్లోకి చేరి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
అయితే పెట్రోల్ బంక్ యాజమాన్యం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. తమ వద్ద ఎలాంటి స్టాక్ లోటు లేదని, ట్యాంక్ లీకేజీ కూడా జరగలేదని స్పష్టం చేసింది.
ఇక ఆరోగ్య శాఖ అధికారులు నీటి నమూనాలు సేకరించి బావి నీరు తాగడానికి పూర్తిగా పనికిరాదని తేల్చారు. అయినప్పటికీ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు సంఘటనా స్థలాన్ని సందర్శించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిపుణుల హెచ్చరికల ప్రకారం బావి నీరు అత్యంత అంటుకునే స్వభావంలో ఉండటంతో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంటే భారీ పేలుడు సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో కావూర్ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య జీవిస్తున్నారు.





